Father Reclaims Land from Son in Hanamkonda District : కుమారుడు బాగానే చూసుకుంటున్నాడు కదా అని ఆ తండ్రి తన పేరు మీద ఉన్న ఆస్తిని కుమారుడికి రాసిచ్చాడు. తీరా రాసిచ్చిన తర్వాత తండ్రితో వాగ్వాదానికి దిగి అతడిని కొట్టాడు. మనస్తాపానికి గురైన తండ్రి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కొందరి సలహాతో తన భూమిని తాను తిరిగి పొంది కుమారుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ గ్రామంలో జరిగింది.
తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ముస్తఫాపూర్ గ్రామానికి చెందిన మద్దెల రాజ కొమురయ్యకు ఐదెకరాల పైచిలుకు భూమి ఉంది. ఆ భూమిలో 4 ఎకరాల 12 గుంటలు భూమి తన ఏకైక కుమారుడు మద్దెల రవికి గతంలో గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేశాడు. కానీ ఈ మధ్యకాలంలో కుమారుడు రవి తండ్రిని కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. దీంతో రాజ కొమురయ్య మనస్తాపానికి గురై సమీపంలోని గుట్టల ప్రాంతంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన అక్కడే ఉన్న గొర్రెల కాపరులు ఆయనను రక్షించి వారితో పాటే తీసుకెళ్లి భోజనం పెట్టించారు. ఇలా నెల రోజుల గడిచిన తర్వాత జరిగిన విషయం వారికి చెబితే వారు ధైర్యం చెప్పారు.
అనంతరం హుజురాబాద్‌లోని ఓ రైస్ మిల్లులో రాజ కొమురయ్య గేట్ కీపర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాజ కొమురయ్య పరిస్థితి తెలుసుకున్న కొంతమంది, సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద కుమారుడికి ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని సలహా ఇచ్చారు. వారి సలహా మేరకు రాజ కొమురయ్య తన కుమారుడికి ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీన పరచుకోవడానికి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.