తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల వెల్లువ - తుది గడువు ఎప్పుడంటే? - Liquor Shops Applications in AP - LIQUOR SHOPS APPLICATIONS IN AP

ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ - మొత్తం 3వేల 396 మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి నోటిఫికేషన్

AP LIQOUR SHOPS TENDERS UPDATES
AP Liquor Shops Application Process (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2024, 7:29 PM IST

AP Liquor Shops Application Process : ఆంద్రప్రదేశ్‌లో నూతన మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో వలే దరఖాస్తులను భర్తీ చేసి గంటల తరబడి బారులు తీరాల్సిన అవసరం లేదని, ఆన్​లైన్ సెంటర్​కు వెళ్లినా కూడా నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం రెండు లక్షల రూపాయలు చలానా చెల్లిస్తే, ఎవరైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని స్పష్టం చేశారు.

టెండర్ దారులకు ఏవైనా సందేహాలు, అనుమానాలు ఉంటే సంబంధిత ఎక్సైజ్ స్టేషన్​కు వెళ్లి అక్కడ ఉన్న అధికారులను సంప్రదించాలని సూచించారు. ఆయా జిల్లా కలెక్టర్ల సమక్షంలో లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. సమయం ఉంది కదా అని నిర్లక్ష్యం చేస్తే చివరి రోజు సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చునని, ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.

పోటీపడే వారి సంఖ్య ఎక్కువే : పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం చర్చ అంతా మద్యం దుకాణాలపైనే జరుగుతోంది. జిల్లాలో ఈ సారి పోటీపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని, బినామీ పేర్లతో వాటిని దక్కించుకోవాలన్న ఆలోచనతో నేతలు ముందుకు వెళ్తున్నారు. మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు పలువురు ముఖ్యనేతలు, వారి బంధువులు, అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ దుకాణాలు దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు.

సిండికేట్‌గా దరఖాస్తులు :పశ్చిమ గోదావరి జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుపై తెరవెనుక మంత్రాంగాలు జోరుగా సాగుతున్నాయి. వ్యక్తిగతంగా దరఖాస్తు చేసేవారు కూడా శుక్రవారం ఆబ్కారీ స్టేషన్ల వద్ద క్యూలు కట్టారు. జిల్లాలో ఆరు స్టేషన్ల పరిధిలో శుక్రవారం 100కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో కొంతమంది సిండికేట్‌గా ఏర్పడి ఒక్కో దుకాణానికి 12 మంది చొప్పున టెండరు దాఖలు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాలకు పెద్ద మొత్తంలో పోటీ నెలకొనడంతో అధికార పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు మేమెంత చెబితే అంతంటూ కొంతమంది బడా బాబులు తయారై బేరసారాలకు తెర లేపుతున్నారు.

టెండర్ల ప్రక్రియ ముగిసి ప్రభుత్వానికి చెల్లించే నగదుతో పాటు ఆయా నియోజకవర్గాల్లో వ్యాపారాన్ని బట్టి ఒక్కో మద్యం దుకాణానికి 8 నుంచి 25 లక్షల రూపాయలను పెద్దలకు చెల్లించాలన్న ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. ఏపీలో ఈ నెల 12వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం షాపులు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణ మళ్లీ ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయించిన ప్రభుత్వం, రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసింది. అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3 వేల 396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది.

దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే : ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కో దానికి 2 లక్షలు చొప్పున నాన్‌ రిఫండబుల్‌ రుసుము చెల్లించాలి. డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్‌ స్టేషన్లలో అందించాలి. దరఖాస్తుల తుది గడువు ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11న లాటరీ తీసి లైసెన్స్‌లు అందించనున్నారు. ఈ నెల 12 నుంచి లైసెన్సుదారులు కొత్త దుకాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు.

మద్యం ప్రియులకు గుడ్​న్యూస్​ - అందుబాటులో కోరుకున్న మద్యం బ్రాండ్లు! - Application For AP New Liquor Shops

మద్యం తాగుతున్నారా? - అయితే మీ మెదడుకు ముప్పు తప్పదు - తాజా అధ్యయనం ఏం తేల్చిందంటే? - ALCOHOL CAUSES BRAIN HEMORRHAGE

ABOUT THE AUTHOR

...view details