Nellore Residential School Student Missing : తనను బాగా చూసుకోవడం లేదని, తన కంటే చెల్లినే బాగా చూసుకుంటున్నారని మనస్తాపానికి గురైన ఓ బాలుడు వసతి గృహం నుంచి వెళ్లిపోయిన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నెల్లూరు జిల్లా కావలిలోని ఓ దంపతులకు ఇద్దరు పిల్లలు. తమ కుమారుడిని నెల్లూరు గ్రామీణ మండలంలోని దేవరపాలెం గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదివిస్తున్నారు. తల్లిదండ్రులు తన కంటే చెల్లికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, తనను సరిగా చూసుకోవడం లేదని గత కొంతకాలంగా మనస్తాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం వసతి గృహం నుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు తల్లిదండ్రులకు లెటర్ రాశాడు. "నా కంటే చెల్లిని బాగా చూసుకుంటున్నారు. నన్ను సరిగా చూసుకోవడం లేదు. ఇంట్లో స్కూల్ ట్యాబ్ ఉంది. దాన్ని స్కూల్లో అప్పగించాలి. మీరు ఏం టెన్షన్ పడొద్దు. రెండు సంవత్సరాల్లో తిరిగి వచ్చేస్తా" అని లేఖ రాశాడు. దీంతో గురుకుల పాఠశాల సిబ్బంది బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు బాధిత తల్లిదండ్రులు బుధవారం నెల్లూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడీ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
పిల్లల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోందా? - విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రుల నిఘా తప్పనిసరి!
చిన్న విషయాలకే మనస్తాపానికి గురై : ఇటీవల కాలంలో పిల్లలు చిన్నవాటికే మనస్తాపానికి గురై తొందరపాటు నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇళ్లలో నుంచి వెళ్లిపోవడం, తనువు చాలించడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా సెల్‌ఫోన్ ఇవ్వడం లేదని ఆత్మహత్య చేసుకోవడం, లేదా తల్లిదండ్రులను కొట్టడం లాంటివి చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎప్పుడూ ఎదిగే పిల్లల మానసిక పరిస్థితిపై దృష్టి సారించాలంటున్నారు వైద్య నిపుణులు. ప్రతి రోజు పిల్లలతో మాట్లాడి, వారి రోజు ఎలా గడిచింతో అడిగి తెలుసుకోవాలని, వారేవైనా సమస్యలు ఎదుర్కొంటుంటే భరోసా కల్పించాలని అంటున్నారు. మనోధైర్యం నింపాలని చెబుతున్నారు. ప్రతి రోజు పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపాలని, అప్పుడే వారు ఎలాంటి విషయాలనైనా చెప్పాలని అనుకుంటే చెబుతారని సూచిస్తున్నారు.
ఆదుకోండయ్యా : ఏడాదిన్నర క్రితం తండ్రి - ఇటీవల తల్లి మృతి - అనాథలైన ఐదుగురు చిన్నారులు
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్! ఆ దేశం కీలక నిర్ణయం!!