General Instructions Group3 Exam Candidates : రాష్ట్రంలో గ్రూప్-3 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి 2 రోజుల పాటు జరిగే పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఉదయం పరీక్ష 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్తవుతుంది. అభ్యర్థులను ఉదయం 9.30 తరువాత పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరు. మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.30 గంటలకు ముగుస్తుంది. అభ్యర్థులను 2.30 గంటల తరువాత ఎగ్జామ్ సెంటర్లోకి పంపబోమని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు.
గ్రూప్-3 అభ్యర్థులకు సూచనలు ఇవే :అభ్యర్థులు తమ వెంట బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, ఒరిజినల్ ఐడీ కార్డ్ తెచ్చుకోవాలని కమిషన్ సూచించింది. హాల్ టికెట్‌పై తాజా పాస్‌పోర్ట్ ఫొటోను అంటించుకొని తీసుకు రావాలని, పాస్‌పోర్ట్ ఫొటో 3 నెలల కంటే పాతది కావొద్దని తెలిపింది. టీజీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్ కాపీని అభ్యర్థులు జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపింది. తొలి రోజు పరీక్షకు తీసుకొచ్చిన హాల్ టికెట్‌ను మిగతా పరీక్షలకు ఉపయోగించాలని పేర్కొంది. ఫలితాలు వచ్చి, రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు ప్రశ్నపత్రాలు, హాల్ టికెట్లను భద్రంగా పెట్టుకోవాలని కమిషన్ సూచించింది.