TGIIC Released Telangana Industry Report :సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో 321 కంపెనీలు రాష్ట్రంలో రూ.7,108 కోట్లను పెట్టుబడులుగా పెట్టేందుకు ముందుకొచ్చినట్లు టీజీఐఐసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ప్రత్యక్షంగా 25,277 మంది తెలంగాణ యువతకు ఈ కంపెనీల ద్వారా ఉద్యోగావకాలు లభిస్తాయని ఇప్పటివరకు అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ఆయా కంపెనీ స్థాపన కోసం టీజీఐఐసీ వివిధ ప్రాంతాల్లో 566.53 ఎకరాల భూమిని కేటాయించినట్లు చెప్పారు. ఈ మేరకు గత పదినెలల్లో కొత్త పరిశ్రమల స్థాపనలో పురోగతిపై నివేదికను సోమవారం విష్ణువర్ధన్‌రెడ్డి విడుదల చేశారు.
గజం భూమి కూడా వృథా పోనీకుండా చర్యలు :ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు దావోస్, అమెరికా, దక్షిణ కొరియాలో చేపట్టిన పర్యటనలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయి. విదేశీ పర్యటనలో భాగంగా ఇరువురు నేతలూ వివిధ కంపెనీలతో జరిపిన విస్తృత చర్చల ఫలితంగా అనేక సంస్థలు రాష్ట్రంలో తమ కంపెనీలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చాయి. పరిశ్రమల శాఖ సైతం పెట్టుబడులు పెట్టే కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారికి అవసరమైన భూమిని సమకూర్చే ప్రయత్నం చేస్తోంది. దీంతో కంపెనీలు తీసుకొచ్చే క్రతువులో కీలక భూమిక పోషిస్తోంది. టీజీఐఐసీ ఆధ్వర్యంలో పరిశ్రమల ఏర్పాటు, అనుమతుల ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ప్రతి సంస్థకు టీజీఐఐసీ భరోసా ఇస్తోంది.
పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే కంపెనీల పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల పాలసీలకు అనుగుణంగా ఉన్న కంపెనీలకు ప్రభుత్వం అందించే అన్నీ సౌకర్యాలను కల్పిస్తున్నామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కంపెనీలకు అందించే ప్రతి గజం భూమి సద్వినియోగం అయ్యేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గత నెలలో పరిశ్రమలకు చేసిన పలు భూమి కేటాయింపుల వివరాలను వెల్లడించారు. గత నెలలోనే తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, స్టేట్ లెవెల్ ల్యాండ్ అలాట్‌మెంట్ కమిటీకి వచ్చిన భూకేటాయింపుల దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే 70 కంపెనీలు భూకేటాయింపులకు అర్హమైనవి టీజీఐఐసీ గుర్తించిందని చెప్పారు. ఈ మేరకు దీనికి సంబంధించిన భూకేటాయింపులు ఉత్తర్వులు జారీచేసిందని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో రూ.1721 కోట్ల పెట్టుబడులు, ,543 మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయని తెలిపారు.