TG Govt Action Plan On Projects :ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే లక్ష్యంతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. "స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫీషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) పేరుతో కార్యాచరణ చేపడుతోంది. కీలకమైన 19 ప్రాజెక్టులను స్పీడ్ పరిధిలోకి తీసుకొచ్చారు. మూసీ రివర్ ఫ్రంట్, శాటిలైట్ టౌన్ల అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరణ, రీజనల్ రింగు రోడ్డు, హైదరాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్లు, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, దిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం, మహిళా శక్తి పథకం, జిల్లా సమాఖ్య భవనాలు, సమీకృత గురుకుల సముదాయాలు, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల అభివృద్ధి, ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్పు, కొత్త ఉస్మానియా ఆస్పత్రి, కొత్తగా 15 నర్సింగ్, 28 పారా మెడికల్ కాలేజీలు, హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధి, రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనను స్పీడ్‌లో చేపట్టనున్నారు.
స్వయంగా సమీక్షించునున్న ముఖ్యమంత్రి :స్పీడ్ కార్యక్రమం ద్వారా చేపట్టే ప్రాజెక్టులు, పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించనున్నారు. సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సీఎం సమావేశమై నిధుల మంజూరు, కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు, న్యాయపరమైన ఆటంకాలు, తదితర విషయాలపై చర్చించడంతో పాటు సీఎం స్థాయిలో వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. స్పష్టమైన గడువు విధించుకొని నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేసేలా లక్ష్యాలు పెట్టనున్నారు. స్పీడ్ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు, పనులపై సంబంధిత విభాగాలు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తాయి.
నిర్ణితీ కాల వ్యవధిలోగా :ఏ గడువులోగా ఎంత పని జరుగుతుందనే నిర్ణీత కాల వ్యవధిని ఇందులో పొందుపరుస్తారు. ఎప్పటివరకు ఏయే పనులు పూర్తవుతాయనే పనుల అంచనాలను ప్రస్తావిస్తారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపాలను అధిగమించేందుకు స్పీడ్ ప్రత్యేక చొరవ ప్రదర్శిస్తుంది. స్పీడ్ పరిధిలోని ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఆయా విభాగాలు ప్రత్యేక విధానం అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.