తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా ముగిసిన ప్రజాపాలన వార్షికోత్సవాలు - భవిష్యత్తు ప్రణాళికలు వెల్లడించిన ప్రభుత్వం - PRAJA PALANA VIJAYOTSAVALU

ప్రజాపాలన వార్షికోత్సవాలను ఘనంగా ముగించిన ప్రభుత్వం - నవంబరు 14న నెహ్రూ జయంతి రోజు నుంచి సోనియాగాంధీ పుట్టిన రోజు(డిసెంబరు 9) వరకు ఉత్సవాల నిర్వహణ

Praja Palana Vijayotsavalu
Praja Palana Vijayotsavalu In Telangana (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2024, 8:47 AM IST

Praja Palana Vijayotsavalu: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట నవంబరు 14 నుంచి డిసెంబరు 9 వరకు వివిధ రూపాల్లో కార్యక్రమాలు, వేడుకలను జరిపారు. తెలంగాణ రైజింగ్ నినాదంతో ఉత్సవాలు చేశారు. జవహర్​లాల్ నెహ్రూ జయంతిన ఎల్బీ స్టేడియంలో విద్యా దినోత్సవంతో వేడుకలు మొదలు పెట్టారు. ఆ తర్వాత వరంగల్‌లో మహిళ విజయోత్సవాలు, మహబూబ్‌నగర్‌లో రైతు పండగ, పెద్దపల్లిలో యువజన ఉత్సవాల పేరుతో ప్రభుత్వం సభలు నిర్వహించింది. హైదరాబాద్, వరంగల్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసింది.

సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు : చివరి మూడు రోజులు పండగ వాతావరణాన్ని కల్పించారు. సచివాలయం, హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఘనంగా సంబరాలు నిర్వహించారు. మూడు రోజుల పాటు ఫుడ్, హాండీక్రాఫ్ట్స్ స్టాళ్లు ప్రజలకు అందుబాటులో ఉంచి సాయంత్రం వేళల్లో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను అందుబాటులో ఉంచారు. ఈనెల 7న వందేమాతరం శ్రీనివాస్, 8న రాహుల్ సిప్లిగంజ్, నిన్న తమన్ సంగీత ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. ఓ పాటకు మంత్రి పొన్నంతో పాటు ప్రజా ప్రతినిధులంతా తమ సెల్ ఫోన్ టార్చ్ లైట్లు ఆన్ చేసి సందడి చేశారు. జీహెచ్ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి ఓ పాటకు డ్యాన్స్‌ చేసి సందడి చేశారు.

ప్రజాపాలన విజయోత్సవాలు :తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా ముగించింది. సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి రూపం, విగ్రహంపై ఉదయం అసెంబ్లీలో సీఎం ప్రకటన చేశారు. తెలంగాణ తల్లిని ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ తల్లి జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి చిత్ర రూపాన్ని అవమానపరచడం, వేరే విధంగా చూపడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణ తల్లి చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో మాటలు, ధ్వంసం చేయడం, చేతలతో అగౌరవపరిచడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపరచడాన్ని నేరంగా పరిగణించనున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు : డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార కార్యక్రమంగా జరుపుకోవాలని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర బహుజనుల పోరాట పటిమ, సంప్రదాయ, సాంస్కృతిక, వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవనశైలిని, భావితరాలకు స్ఫూర్తిని అందించే చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని ప్రభుత్వం భావించినట్లు జీవోలో తెలిపారు. ఇక నుంచి ప్రతీ ఏటా డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని జరపాలని ప్రభుత్వం తెలిపింది. సంక్షోభం నుంచి సంక్షేమానికి అవినీతి నుంచి అభివృద్ధి వైపు, తెలంగాణను పునర్నిర్మిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ తల్లి విగ్రహం: 20 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం మలిచింది. జవహర్​లాల్​ నెహ్రూ ఫైన్​ ఆర్ట్స్​ యూనివర్సిటీ ప్రొఫెసర్​ గంగాధర్​ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చిత్రీకరించారు. బంగారు అంచు ఆకుపచ్చని చీరలో సంప్రదాయ కట్టుబొట్టుతో, ప్రశాంత వదనం, గుండు పూసల హారం, మెడకు కంఠె, చేతికి గాజులు, మెట్టెలు, ముక్కుపుడక, చెవులకు బుట్టకమ్మలు, కాళ్లకు కడియాలతో తెలంగాణ తల్లిని రూపొందించారు. అలాగే కుడిచేతితో అభయానిస్తూ, ఎడమచేతిలో వరి, సజ్జ, జొన్న, మొక్కజొన్న పంటలతో తెలంగాణ తల్లిని ఆవిష్కృతం అయింది. తెలంగాణ తల్లి రూపకర్తలతో పాటు జయజయహే తెలంగాణ రచించిన అందెశ్రీని సీఎం సత్కరించారు.

ఫోర్త్ సిటీలో 300 గజాల ఇంటి స్థలంతో పాటు కోటి రూపాయలు :తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా మహిళలు, ఉద్యమకారులు తరలివచ్చారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బహుజనుల తల్లి రూపాన్నే తెలంగాణ తల్లిగా రూపొందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన కవులు, కళాకారులను గౌరవిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి.. గూడ అంజయ్య, బండి యాదగిరి, అందెశ్రీ, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావు, గద్దర్ కుటుంబాలకు ఫోర్త్ సిటీలో 300 గజాల ఇంటి స్థలంతో పాటు కోటి రూపాయలు, తామ్రపత్రాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

డ్రోన్, బాణాసంచా ప్రదర్శన : తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనంతరం డ్రోన్, బాణాసంచా ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను డ్రోన్ షోతో ప్రదర్శించారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా హైదరాబాద్​లోని ప్రముఖ ప్రాంతాలు, కట్టడాలన్నీ విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

ఏటా డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం - అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details