TG Education Department Focus On Inter Study Plans : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటర్ వార్షిక పరీక్షలకు ఇంకా 3 నెలలే సమయం ఉంది. దీంతో కళాశాలల వారీగా 90 రోజుల ప్రణాళిక రూపొందించింది. ప్రతి విద్యార్థి ఎలా చదుతున్నాడని తెలుసుకొని వెనకబడిన వారి కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహించనున్నారు. కళాశాలలకు రాని విద్యార్థులు వారి తల్లిదండ్రలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇంటర్ బోర్డు కార్యదర్శిగా, ఇంటర్ విద్యాశాఖ సంచాలకుడు కృష్ణ ఆదిత్య రాష్ట్రంలోని 428 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఇంటర్ విద్యాశాఖ జిల్లా నోడల్ అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. అందులో కీలక నిర్ణయాలు తీసుకుని కార్యాచరణ రూపొందించారు.
ఉత్తీర్ణత పెంచడమే లక్ష్యం : అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండేళ్లు కలిపి 1.80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కొన్ని కళాశాలలో సగం మంది విద్యార్థులు కూడా తరగతులకు హాజరు కావటం లేదు. దీంతో ఉత్తీర్ణత 50 శాతానికి మించడం లేదు. 2023లో ఫస్టియర్‌లో 40% మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. ఈ క్రమంలో గత మూడేళ్ల గణాంకాలను పరిశీలించిన కృష్ణ ఆదిత్య కళాశాలకు హాజరుకాని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కళాశాలకు పిలిపించి మాట్లాడాలని తెలిపారు. రెండు, మూడుసార్లు పిలిచినా రాకుంటే వారి పేర్లను తొలగించాలని సూచించారు.
తల్లిదండ్రులతోనూ సమావేశాల నిర్వహణ :చదువులో ప్రతి విద్యార్థి ఎంత చదువుతున్నాడో గమనించి వెనకబడి ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని అధ్యాపకులకు తెలిపారు. అన్ని సబ్జెక్టుల వారీగా ప్రణాళిక రూపొందించి 90 రోజులు అమలు చేయాలన్నారు. అందుకు కళాశాలలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని నివేదిక పంపాలని తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల వారీగా 2వ తేదీన సమావేశాలు నిర్వహించనున్నారు.