Tension at Perni Nani House in Machilipatnam :మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని తీరుకు నిరసనగా జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో పవన్‌ను ఉద్దేశించి పేర్నినాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటి ముట్టడికి జనసైనికులు యత్నించారు. పేర్ని నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పేర్ని నానికి వ్యతిరేకంగా జనసేన నేతలు నినాదాలు చేశారు.
జనసైనికులకు ధీటుగా పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు కూడా వైఎస్సార్సీపీ కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. దీంతో పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మోహరింపుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకు దిగిన నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతోపాటు జనసైనికులను పోలీసులు అరెస్ట్ చేశారు. పేర్ని కిట్టు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను కూడా పోలీసులు వెనక్కి పంపించి వేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.