Ten Months Child Suffering With Spinal muscular Diseases :ముద్దులొలికే ఈ చిన్నారి పేరు వైష్ణవి. వయస్సు పది నెలలు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పిల్లల వార్డులోని బెడ్ పై అమాయకంగా ఆడుకుంటున్న ఈ పసికందు ఆయువు రూ.17 కోట్లతో ముడిపడి ఉంది. బుడి బుడి నడకలతో సందడి చేస్తూ బోసినవ్వులు ఒలకబోసే పసిప్రాయానికి అరుదైన వ్యాధి సోకింది.
జనగామలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ప్రశాంత్, సంపూర్ణల గారాల పట్టి వైష్ణవి. పాప పుట్టగానే సాక్షాత్తు మహాలక్ష్మే పుట్టిందని కుటుంబ సభ్యులు సంబరపడ్డారు. కానీ పుట్టి నాలుగు నెలల్లో పాపలో హుషారు లోపించడం, బొర్లాపడకపోవడంతో అనుమానించిన తల్లిదండ్రులు స్ధానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడున్న వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులకు చూపించగా పిల్లల్లో అరుదుగా వచ్చే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధి అని నిర్ధారించారు. పాప బతకాలంటే విదేశాల నుంచి ఇంజెక్షన్ తెప్పించాలని దాని ఖరీదు 17 కోట్లవుతుందని వైద్యులు తేల్చి చెప్పారు.
పాపకు రెండేళ్లలోపే ఇంజెక్షన్ చేయాలని లేదంటే బతకదని వైద్యులు చెప్పిన మాటలు విని ఈ నిరుపేద తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కేవలం 12 వేల రూపాయల ఆదాయంతో బతికే వీరికి రూ.17 కోట్ల రూపాయలు తేవడం శక్తికి మించిన భారమే. ప్రస్తుతం పాపకు న్యుమోనియా కూడా సోకడంతో ఎంజీఎంలోని పిల్లల వార్డులో ఉంచారు. పది నెలల క్రితమే ఊపిరి పోసుకున్న ఈ చిన్నారి ఇప్పుడు ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతోంది.