Temperatures Rises in Telangana :భానుడి ప్రతాపం కారణంగా ప్రజలకు పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయి. మండే ఎండల దాటికి జనం బేజారౌతున్నారు. వరంగల్‌లో పది గంటల నుంచే గ్రీష్మతాపం మొదలవగా, 11 గంటలకల్లా అది ఉద్ధృతమౌతోంది. మధ్యాహ్నం 12 గంటలకు భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దాదాపు అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయని వాతావరణశాఖ(Indian Metrological Department) వెల్లడించింది. మండుతున్న ఎండల ధాటికి నగర వీధులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
అత్యధికంగా నల్గొండ జిల్లాలో :నల్గొండలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవ్వగా జోగులాంబ గద్వాల్ జిల్లాలో 43.3 డిగ్రీలు, కుమురం భీం జిల్లాలో 43.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లాలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 43 డిగ్రీలు, వనపర్తి జిల్లాలో 42.9 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Imd Weather News Today :ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఎండల ధాటికిఇక్కట్లు పడుతున్నారు. వివిధ పనులు నిమిత్తం బయటకు వచ్చిన వారంతా త్వరత్వరగా పనులు ముగించుకుంటున్నారు. మధ్యాహ్న సమయంలో ట్రాఫిక్ రద్ది తగ్గి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. చిరువ్యాపారులు, రోజు వారి కూలీలు(Daily Labour) నానా అగచాట్లు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల పరిస్ధితి దయనీయంగా ఉంది.