Telugu People in Trump Victiry : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయంపై నగరవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి అత్యధిక మంది రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌నకు మద్దతు పలికినట్లు అమెరికాలోని తెలుగు వారు చెబుతున్నారు. ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున విరాళాలు అందించినట్లు తెలిపారు. ట్రంప్ తరఫున ప్రచారాన్ని నిర్వహించిన బృందంలో మన తెలుగు వారూ ఉండటం విశేషం.
అధ్యక్ష ఎన్నికల గెలుపులో ముఖ్య భూమిక పోషించారు మన తెలుగు వారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు ట్రంప్ చేపట్టబోతున్న తరుణంలో భారత్‌తో సంబంధాలు, విద్యార్థి విసాలు, గ్రీన్ కార్డుల అంశాలపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు అనే చర్చలు మొదలయ్యాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో అమెరికా-భారత్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన ప్రచార ప్రతినిధుల బృందంలో ఒకరైన తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు. భారత్‌తో కాలుదువ్వుతున్న దేశాలు వెనక్కి తగ్గే అవకాశం ఉందని వాషింగ్టన్ డీసీలో ఉంటున్న ఆయన ఈటీవీ భారత్‌తో పేర్కొన్నారు.
ట్రంప్‌నకు మద్దతుగా నిలిచిన తెలుగువారి కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అమెరికా పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తామని అన్నారు. అదే సమయంలో అమెరికాలో తెలుగు వారు కూడా పెట్టుబడులు పెట్టేలా చూస్తామన్నారు. పరస్పర ప్రయోజనాలు ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.