Telangna Rhythu Runa Mafi Latest Update : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ జులై 18న రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. మొత్తం మూడు విడతల్లో ఈ ప్రక్రియను చేపట్టింది. అందులో భాగంగా మొదటి విడతలో రూ.లక్ష వరకు పంట రుణమాఫీజరిగింది. ఆ తర్వాత రెండో విడతలో జూలై 30న రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు రైతు రుణాలు మాఫీ చేశారు. ఇక ఆగస్టు 15న మూడో విడతలో భాగంగా రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు రుణాలున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే కొంతమందికి రుణమాఫీకి అన్ని అర్హతలూ ఉండి కూడా అకౌంట్లలో డబ్బులు పడటం లేదు. అలాగే చాలా మంది రైతులు రూ.2 లక్షల కంటే ఎక్కువ క్రాప్ లోన్ తీసుకుని ఉన్నారు. వారి పరిస్థితి ఏంటనే దానిపై ప్రస్తుతం చర్చ జరుపుతోంది. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రుణమాఫీ కానివారు, రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్నవారికి సీఎం రేవంత్రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో అక్టోబర్ 5న (శనివారం) నిర్వహించిన దివంగత నేత జి.వెంకటస్వామి 95వ జయంతి కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రుణమాఫీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉండి, రూ.2 లక్షలు క్రాప్ లోన్ ఉన్నవారందరికీ రుణమాఫీ జరిగింది. రూ.2 లక్షలకు పైగా ఉన్నవారికి మాత్రమే రుణమాఫీ జరగలేదు. అలాంటి వారందరూ రూ.2 లక్షల కంటే పైన ఉన్న అమౌంట్ బ్యాంకులలో చెల్లించండి. ఆ తర్వాత వెంటనే వారికి కూడా రుణమాఫీ చేస్తాం" అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.