Telangana Weather Report Today : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 36 నుంచి 43 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. మరో వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అందులోనూ తెలంగాణలో కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొంటున్నది.
ఓ వైపు ఎండలు ఠారెత్తిస్తుండగా, మరోవైపు అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. రెండ్రోజుల క్రితం పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిసి, రైతన్నలకు తీవ్ర నష్టాన్ని సైతం కలిగించాయి. భాగ్యనగరంలోనూ వర్షం దంచికొట్టింది. హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో రాగల మూడు రోజులు కొన్ని జిల్లాలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అలానే ఈరోజు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది.
Weather Forecasting Telangana :ఇదే క్రమంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ఒకటి తెలంగాణ, పరిసర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఏర్పడిందని వెల్లడించింది. ద్రోణి గాలి విచ్ఛిన్నతి ఒకటి తెలంగాణ పరిసర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ కేంద్ర సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు.