Telangana Weather Report Today : రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50కిలో మీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. రాగల నాలుగు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.
సోమవారం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి/గాలి విచ్చిన్నతి కొనసాగింది. ఈరోజు సైతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అలాగే పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
IMD Alert on Heavy Rains in Telangana :ఈ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సమయంలో పిడుగులు ఎక్కువగా ఉంటాయని, ఈ సమయంలో ప్రజలు బయటకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొంటుంది.