Investment Flow To The State : రాష్ట్రంలో కొత్తగా 24 భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. తద్వారా వీటిలో వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. తమకు రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలని ఆయా సంస్థల యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. టీ-ఐడియాలో మెగా ప్రాజెక్టు హోదా కింద వీటి రాయితీల ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించి, సిఫారసు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల కోసం పరిశ్రమల యజమానులను ఆహ్వానించింది. భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని కూడా ప్రకటించింది. ఈ మేరకు ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపింది. ఫలితంగా పారిశ్రామిక వర్గాల నుంచి సానుకూలత వ్యక్తమైంది. దీంతో అవి కొత్త ప్రతిపాదనలతో ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నాయి. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించినట్లయితే అవి కార్యరూపం దాల్చుతాయి.
పరిశ్రమవర్గాల దరఖాస్తులు :పెట్టుబడులు పెట్టేందుకు దరఖాస్తు చేసిన వాటిలో ములుగు జిల్లాలోని మంగపేట మండల కేంద్రం పరిధిలో కమలాపురంలో మూతపడిన కాగితం మిల్లు స్థానంలో 2.50 లక్షల టన్నుల సామర్థ్యంతో పేపర్ బోర్డు మిల్లును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్ (ఫ్యాబ్) సిటీలో ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 75 ఎకరాల్లో 4 గిగావాట్ల పీవీ టాప్‌కాన్ సెల్, మాడ్యూల్స్, 14.86 ఎకరాల్లో 1 గిగావాట్ సోలార్ పీవీ మాడ్యూళ్లు, 19.06 ఎకరాల్లో రూ.700 కోట్ల పెట్టుబడితో 1033 మెగావాట్ల సోలార్ పీవీ సెల్, 1014 సోలార్ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమలు ఉన్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలోని దివిటిపల్లి ఎనర్జీ పార్క్‌లో 20 ఎకరాల్లో లోహం మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ క్రిటికల్ మెటీరియల్స్ రీసైక్లింగ్, రిఫైనింగ్, ప్రాసెసింగ్ పరిశ్రమ, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ ఏరో స్పేస్ సెజ్‌లో విమానాల విడి భాగాల అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేశాయి.
పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న యాజమాన్యాలు :సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానీపురంలో డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ సంస్థ తమ సిమెంట్ పరిశ్రమ విస్తరణకు దరఖాస్తు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవిందాపూర్ గ్రామంలో హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థ చాక్లెట్ల తయారీ పరిశ్రమ, పాలశుద్ధి కేంద్రం, 25 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు సుముఖతను వ్యక్తంచేసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్‌లో జెమిని ఎడిబుల్స్, మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీలో రెన్యూసిస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సోలార్ పీవీ మాడ్యుల్ లైన్స్ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్‌లో జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా) సంస్థ నూనెల శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేశాయి.