CM Revanth Revealed Details of Samagra Kutumba Survey Details : రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే, సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి నివేదికను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. సమగ్ర ఇంటింటి కుల సర్వేను ఫిబ్రవరి 2024లో నిర్వహించినట్లు తెలిపారు. సర్వేకు ముందు కర్ణాటక, బిహార్ సహా వివిధ సర్వేలను క్షుణ్నంగా అధ్యయనం చేశామన్న ఆయన, సర్వేల తయారీలో వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలు తీసుకున్నామని వివరించారు.
రాష్ట్రంలో దాదాపు 50 రోజులపాటు సర్వే జరిగిందని, గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాల్లో, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 1.12 కోట్ల కుటుంబాల సర్వే జరిగిందని, 3.56 లక్షల కుటుంబాల్లో సర్వే జరగలేదని చెప్పారు. ఈ సర్వే డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడుతామని తెలిపారు.
కుల సర్వే ప్రకారం కులాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి | ||
కులం | సంఖ్య | శాతం |
ఎస్సీ | 61,84,319 | 17.43 |
ఎస్టీ | 37,05,929 | 10.45 |
బీసీలు (ముస్లిం మైనార్టీ మినహా) | 1,64,09,179 | 46.25 |
ముస్లిం మైనార్టీలు | 44,57,012 | 12.56 |
ముస్లిం మైనార్టీల్లో బీసీలు | 35,76,588 | 10.08 |
ముస్లిం మైనార్టీల్లో ఓసీలు | 8,80,424 | 2.48 |
ముస్లిం మైనార్టీలు మినహా ఓసీలు | 47,21,115 | 13.31 |
ఓసీలు | 56,01,539 | 15.79 |
"ఈ సర్వే భవిష్యత్‌లో మైలురాయిగా నిలుస్తుంది. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, ఉపాధి పథకాలకు ఇది దిక్సూచిగా నిలుస్తుంది. 56 శాతంపైగా ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించాలి. కులసర్వేలో పాల్గొన్న అందరినీ రాజకీయాలకతీతంగా అభినందించాలి." - రేవంత్ రెడ్డి, సీఎం
నిర్ణయం తీసుకున్న ఏడాది లోపే సర్వే చేయించాం : జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించారని, ఒక ఎన్యుమరేటర్ రోజుకు 10 ఇళ్ల కంటే ఎక్కువ ఇళ్లు సర్వే చేయలేదని తెలిపారు. 8 పేజీలతో ఉన్న ప్రశ్నపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేశామని పేర్కొన్నారు. 76 వేల మంది డేటాఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల పాటు డేటా క్రోడీకరించారని వివరించారు. రూ.125 కోట్లు ఖర్చు చేసి సమగ్రమైన వివరాలు సేకరించామన్నా ఆయన నిర్ణయం తీసుకున్న ఏడాదిలోపే పకడ్బందీగా సర్వే చేయించామని తెలిపారు.
నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చ
తెలంగాణలో కుల గణన సర్వే పూర్తి - ఓసీలు 15.79 శాతం, బీసీలు ఎంతంటే?