Telangana State 2024 Budget : రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం ఇంధనశాఖకు బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖకు భారీగా నిధులు కేటాయించింది. గతేడాది బడ్జెట్‌లో 12,727 కోట్ల రూపాయలు కేటాయించగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈసారీ 16,410 కోట్ల రూపాయలను కేటాయించింది. గృహజ్యోతి పథకం కింద 200ల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేస్తున్న నేపథ్యంలో ఆ రాయితీని కూడా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు.
రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ - ఏయే శాఖకు ఎంత కేటాయించారంటే ? - TELANGANA BUDGET 2024
గృహజ్యోతి పథకానికి నిధులు.. ఈ పథకానికి ప్రత్యేకంగా 2,418 కోట్ల రూపాయలను కేటాయించింది. గృహజ్యోతి పథకం కింద అర్హులైన లబ్దిదారులకు డిస్కంలు గత మార్చి ఒకటో తేది నుంచి జీరో బిల్లులు జారీ చేస్తున్నాయి. ఈ బిల్లుల చెల్లింపుల కింద డిస్కంలకు 2,418 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు వీలుగా బడ్జెట్ కేటాయింపులు చేశారు. ఈ పథకం కింద జూలై 15 నాటికి 45,81,676 ఇళ్లకు జీరో బిల్లులు జారీ అయినట్లు బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది.
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్ మిషన్ నష్టాలు తగ్గించాలని దృష్టిసారించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సబ్ స్టేషన్ల నిర్మాణం, హైఓల్టేజీ పవర్ ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యం పెంపునకు 3,017 కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. కొత్తగా పవర్ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు చార్జింగ్ సౌకర్యాలను సులభంగా అందుబాటులోనికి తీసుకురావడానికి టీ.జీ.ఈ.వీ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తుంది.