తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో హెచ్‌ఐవీ బాధితులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? - ఆ జిల్లాల్లోనే అధికంగా

హెచ్‌ఐవీ బాధితుల్లో తెలంగాణ ఆరో స్థానం - వెల్లడించిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ - 2010-23 మధ్య కాలంలో వార్షిక వ్యాప్తిలో 58 శాతం తగ్గుదల నమోదు

HIV Cases In Telangana
Telangana Ranks sixth in HIV Cases (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Telangana Ranks sixth in HIV Cases : హెచ్‌ఐవీ బాధితుల్లో తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 25.44 లక్షలు కాగా, అందులో తెలంగాణలో 1.58 లక్షల మంది ఉన్నట్లు తెలిపింది. బాధితుల సంఖ్య పరంగా తొలి ఐదు స్థానాల్లో మహారాష్ట్ర (3.90 లక్షలు), ఆంధ్రప్రదేశ్‌ (3.20 లక్షలు), కర్ణాటక (2.80 లక్షలు), ఉత్తర్‌ప్రదేశ్‌ (1.97 లక్షలు), తమిళనాడు (1.69 లక్షలు)లు ఉన్నాయి. జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ఆదివారం విడుదల చేసిన ‘ఇండియా హెచ్‌ఐవీ ఎస్టిమేట్స్‌ 2023’ నివేదిక ఈ మేరకు తెలిపింది.

తెలంగాణలోని 1.58 లక్షల మంది బాధితుల్లో 1.54 లక్షల మంది 15 ఏళ్లు పైబడిన వారే. ఇందులో 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు వారు 9,250 మంది ఉన్నారు. యేటా 2,960 మంది హెచ్‌ఐవీ బారిన పడుతున్నారు. తెలంగాణలో 15-49 ఏళ్ల మధ్య వయసున్న మహిళా సెక్స్‌ వర్కర్లలో హెచ్‌ఐవీ వ్యాప్తి 0.25%, మేల్‌ సెక్స్‌ వర్కర్లలో వ్యాప్తి 0.00005% మేర ఉంది. మత్తు మందులు, సూదుల రూపంలో తీసుకునే వారిలో వ్యాప్తి 0.35%. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే చివరి స్థానంలో ఉంది. 2010-2023 మధ్యకాలంలో ఏటా హెచ్‌ఐవీ వైరస్‌ సోకే వారి సంఖ్య అంతకు ముందుతో పోలిస్తే 58 శాతం మేర తగ్గింది. ఇది జాతీయ సగటు 44.2 శాతం కంటే ఎక్కువే. దీంట్లో తెలంగాణ జాతీయ స్థాయిలో 11వ స్థానంలో నిలిచింది.

ఈ జిల్లాల్లో ఎక్కువ మంది బాధితులు : తెలంగాణలో 2023లో ఎయిడ్స్‌తో 2,820 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రతి లక్ష మందిలో 7.44 మంది ఎయిడ్స్‌ సమస్యతో చనిపోతున్నారు. 2010-2023 మధ్య కాలంలో ఈ తరహా వార్షిక మరణాల్లో 81.7 శాతం తగ్గుదల నమోదైంది. రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, మేడ్చల్‌-మల్కాజిగిరి, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, హనుమకొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో హెచ్‌ఐవీ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ములుగు, వనపర్తి జిల్లాల్లో తక్కువగా నమోదవుతున్నాయి. మిగిలిన జిల్లాల్లో మధ్యస్థంగా వ్యాపిస్తోంది. 2023లో అత్యధికంగా హెచ్‌ఐవీ సోకిన వారి సంఖ్యలో రంగారెడ్డి (421) జిల్లా ప్రథమ స్థానంలో ఉంది అని నివేదిక వెల్లడించింది.

వరల్డ్​ ఎయిడ్స్ డే ​: హెచ్​ఐవీ ఎన్ని మార్గాల్లో సోకుతుందో మీకు తెలుసా?

'ఎయిడ్స్​ వల్ల నిమిషానికి ఒకరు మృతి - 4 కోట్ల మందికి HIV' - UNAIDS Report

ABOUT THE AUTHOR

...view details