Police Cutout Viral Video : తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. చాలా ఘటనల్లో హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటి కారణాలతో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం సహా పోలీసులు, సామాజిక కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా, పలువురు మాత్రం హెల్మెట్, సీటు బెల్టు వంటివి పెట్టుకోవడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు. ట్రాఫిక్ పోలీసులు సైతం నిబంధనల ఉల్లంఘనల కింద చలాన్లు వేస్తున్నా, అవి కడుతున్నారు కానీ, రూల్స్ మాత్రం పాటించడం లేదు.
దీంతో ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు గస్తీ పెంచారు. అడుగడుగునా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ఇలాంటి వారి భరతం పడుతున్నారు. కొన్నిచోట్ల చెక్‌పోస్టులకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే పలుచోట్ల 'ట్రాఫిక్ పోలీస్'ల కటౌట్‌లు ఏర్పాటు చేసి వాహనదారులను దారిలోకి తెస్తున్నారు. 'కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్' అన్నట్లుగా మన పోలీసన్నలు చేసిన ఈ ఉపాయం, మంచి ఫలితాలనే ఇస్తుంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.