Telangana Phone Tapping Case Updates : ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా అరెస్టైన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. గత నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో ఆయన ఆగడాలు పతాకస్థాయికి చేరాయి. ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారు. సదరు పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం తన బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా టాస్క్‌ఫోర్స్ వాహనాల్లోనే డబ్బులు తరలించారు.
Election Money Transported in Task Force Vehicles : హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాల్లోని సదరు పార్టీ అభ్యర్థులకు డబ్బు పంపడంలో రాధాకిషన్‌రావు బృందం కీలకంగా వ్యవహరించింది. ఇందుకోసం పోలీసు వాహనాలైతే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడ అమలు చేశారు. ఈ వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల్లో కొందరిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. త్వరలోనే మరికొందరి అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఇమిడి ఉండటంతో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్టును చేర్చనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆధారాల ధ్వంసం సెక్షన్లు మాత్రమే ఉండటంతో పోలీసులు ఈ దిశగా ఆలోచన చేస్తున్నారు.
Task Force EX OSD Radhakishan Rao Arrest Updates :రాధాకిషన్‌రావును శుక్రవారం సుదీర్ఘంగా పోలీసులు విచారించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయ్యాక కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అక్కడినుంచి ఆయణ్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. రాధాకిషన్‌రావును పోలీసు కస్టడీకి తీసుకునేందుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైళ్లు రూపొందించి అక్రమంగా పర్యవేక్షించడంతోపాటు ఎన్నికల సమయంలో అక్రమంగా నగదు తరలింపులో కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
రాధాకిషన్‌రావు బృందం ప్రధాన పార్టీ నాయకులపై పోటీచేసే ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంలోనూ కీలకంగా వ్యవహరించింది. దీని కోసం ముందుగా పలువురు నేతలు, వ్యాపారుల ప్రొఫైళ్లు రూపొందించి ఎస్‌ఐబీ కార్యాలయంలో ప్రణీత్‌రావుకు ఇచ్చేవారు. అతను వారి కదలికలు, కార్యకలాపాలపై సాంకేతిక సాయంతో రహస్యంగా సమాచారం సేకరించి తిరిగి ఆయనకు చేరవేసేవారు. దీని ఆధారంగా రాధాకిషన్‌రావు బృందం (TS Phone Tapping Case)క్షేత్రస్థాయిలో ఆపరేషన్లు చేపట్టి ప్రధాన పార్టీ ప్రత్యర్థుల్ని కట్టడి చేయడంపై దృష్టి సారించింది.