Mahesh Kumar Goud letter to KCR :కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు నిరంతరం బురద జల్లుతూ ప్రజలను తప్పుదారి పట్టించడం మానుకోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. ఆరు పేజీల బహిరంగ లేఖలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పోరాటం చేసిందెవరు? దాని ఫలితం అనుభవించిందెవరు? మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని ఇస్తే అప్పుల పాలు చేసిందెవరు? అంటూ సవాలక్ష ప్రశ్నలతో బహిరంగ లేఖను పంపారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆ లేఖలో వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై స్పష్టత ఇచ్చే దిశలో తాను ఈ లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనతోనే తెలంగాణ వెనకబాటుకు గురైందని ఆరోపించారు. సెంటిమెంట్ పేరుతో రెండుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలోకి వచ్చిన కేసీఆర్, గడీల పాలన చేసి ప్రజలకు కన్నీరు మిగిల్చారని విమర్శించారు.
నిరంతరం ఫాంహౌస్‌లోనే : రాష్ట్రానికి గుండెకాయలాంటి సచివాలయానికి రాకుండా ఫాంహౌస్‌కే పరిమితమై పాలన సాగించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. మొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పి, తిమ్మిని బమ్మిని చేసి కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఉద్యమించి, మాయమాటలతో పీఠమెక్కిన కేసీఆర్ అన్యాయంతో పాలన సాగించారని విమర్శించారు.
ఉద్యమంలో కవులు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు ఇలా సబ్బండ వర్గాలు ప్రాణాలకు తెగించి పోరాడితే చివరకు కేసీఆర్ రాష్ట్రాన్ని తమ కుటుంబ సభ్యుల కబంధ హస్తాల్లో బంధించి భ్రష్టు పట్టించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పెత్తందారి సర్కార్ వల్ల విసిగిపోయిన ప్రజలు ఆ పాలనకు చరమగీతం పాడారని విమర్శించారు. అయినా కల్వకుంట్ల కుటుంబ సభ్యుల్లో కానీ, ఆ పార్టీ నేతల్లో కానీ ఎలాంటి మార్పు రాలేదని ఆరోపించారు.