TPCC Chief Mahesh Kumar Goud Fires On BRS : మూసీ పరివాహకంలో ఇప్పటివరకు ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూల్చలేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అరగంట వాన పడితే హైదరాబాద్ పరిస్థితి దారుణంగా అవుతోందన్న మహేశ్‌కుమార్, గత పదేళ్లలో 1500 చెరువులు కబ్జాకు గురయ్యాయని వెల్లడించారు. ఇందులో ఎక్కువ శాతం బీఆర్ఎస్ నేతలే ఆక్రమించుకున్నారన్న కాంగ్రెస్ నేత, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఇప్పుడు వారి వైఖరి ఉందని మండిపడ్డారు.
పేద, మధ్య తరగతి కుటుంబాలకు అన్యాయం చేస్తున్నామని దుమ్మెత్తి పోస్తున్న గులాబీ నేతలు, అప్పట్లో రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లలేదా? అని మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన అన్ని పార్టీల అజెండాలో ఉందని వివరించారు. దేశంలోనే అత్యంత కలుషితమైనదిగా మూసీనదికి పేరు ఉందని, కేవలం ఇప్పటివరకు నదీ వ్యర్థాలు మాత్రమే తొలగించినట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి ఎంత మంది రైతులను పొట్టన పెట్టుకుందో అందరికీ తెలుసని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు గురించి ఎంపీ అర్వింద్ మాట్లాడాలని డిమాండ్ చేశారు.
మూసీ ప్రక్షాళనతో కోట్లాది పెట్టుబడులు :హైడ్రా టార్గెట్ భూ బకాసురులు మాత్రమేనన్న మహేశ్‌కుమార్ గౌడ్, దోషుల ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని తేల్చిచెప్పారు. పేదలు నష్టపోతే నష్టపరిహారం ఇస్తామన్న ఆయన, మూసీ పరిసర ప్రాంతాల్లో ఒక్క గుడిసె కూడా తొలగించలేదని తెలిపారు. మూసీ ప్రక్షాళన జరగకపోతే రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కూడా ప్రమాదం ఉందని, సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు వార్తలతో విష ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.