Telangana Lok Sabha Election Polling 2024 Started : రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా ఓటర్లు మెల్లమెల్లగా పోలింగ్ బూత్‌లకు వస్తున్నారు. ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. అయితే పోలింగ్‌కు వాతావరణం కూడా అనుకూలంగా లేదని తెలుస్తోంది. ఉదయాన్నే చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రావడానికి ఇంకాస్త సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ ఓటర్లకు అసౌకర్యం కలుగకుండా అన్ని పోలింగ్ బూత్‌లలో పూర్తిస్థాయిలో ఏర్పాట్లను చేసింది. దివ్యాంగ ఓటర్ల కోసం వీల్ చైర్లను ఏర్పాటు చేసింది.
చీకటి గదుల్లో పోలింగ్ : ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి పలు చోట్ల ఈవీఎలు మొరాయిస్తున్నాయి. దీంతో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. కొన్ని చోట్ల ఆరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరా లేక చీకటి గదుల్లో పోలింగ్ కొనసాగుతోంది. రాత్రి కురిసిన వర్షం, గాలులకు విద్యుత్ నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.
పోలింగ్ బహిష్కరించిన గ్రామస్థులు : ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం రాయమాదారంలోని గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై వంతెన నిర్మిచలేదంటూ పోలింగ్‌ను బహిష్కరించారు. అలాగే యాదాద్రి పోచంపల్లి మండలం కనుముక్కలలో గ్రామస్థులు ఎన్నికలు బహిష్కరించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేసేందుకు వస్తామని పోలింగ్ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు.