Telangana Job Notification Key Reforms : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర సర్కారు ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్‌కు అనుగుణంగా నియామక సంస్థలు వెలువరించే ప్రకటనల్లో కీలక సంస్కరణలు చోటుచేసుకోనున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఒకే విద్యార్హతలతో కూడిన పోస్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం, జనరల్ స్టడీస్ పరీక్ష (పేపర్-1) ఉమ్మడిగా నిర్వహించడం అందులో ముఖ్యమైనది.
టీజీపీఎస్సీతో సహా పోలీసు, గురుకుల, వైద్య రిక్రూట్మెంట్, డీఎస్సీ నియామక మండళ్ల మధ్య సమన్వయంతో నిర్ణీత గడువు లోగా పరీక్షలు పూర్తిచేయడం ఈ సంస్కరణల లక్ష్యమని ప్రభుత్వ వర్గాల సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఏడాదికి సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్‌ను ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యాలెండర్‌లో పేర్కొన్న షెడ్యూలు ప్రకారం ఎగ్జామ్స్ పూర్తిచేసే కార్యాచరణ మొదలైంది.
TG Job Notification Upcoming Changes : ఈ ఏడాది వెలువరించిన గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకారం మెయిన్ పరీక్షల సమయానికి మరో గ్రూప్-1 ప్రకటన వెలువడనుంది. 2022లో వెలువడిన గ్రూప్-2 ఉద్యోగ నోటిఫికేషన్ పరీక్షలు డిసెంబరులో జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి తేదీలు త్వరలో వెలువడే అవకాశాలున్నాయి.
ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, కార్పొరేషన్లలో గ్రూప్-3, 4 ఆయా కేటగిరీ పోస్టులన్నింటికీ కలిపి ఇక నుంచి గ్రూప్-3 నోటిఫికేషన్ రానుంది. గతంలో జిల్లా స్థాయి గ్రూప్-4 పోస్టులకు ఇంటర్మీడియట్, రాష్ట్ర స్థాయి గ్రూప్-3 పోస్టులకు డిగ్రీ ఎలిజిబిలిటీ ఉండేది. ప్రెజెంట్ గ్రూప్-3, 4 పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతగా ఉంది.
విద్యార్హతలు, పోస్టు హోదా ఒకటే కావడంతో జూనియర్ అసిస్టెంట్ లెవల్ పోస్టులన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురానున్నారు. ఈ పోస్టులకు గ్రూప్-3 కేటగిరీ కింద టీజీపీఎస్సీ ఉమ్మడిగా పరీక్ష నిర్వహిస్తుంది. పరీక్షలో మార్కులు, ప్రతిభ ఆధారంగా క్యాండిడేట్స్ తమకు ఇష్టమైన ఐచ్ఛికం ఇచ్చి గ్రూప్-3 కేటగిరీకి వెళ్లాలా? లేదా గ్రూప్-4 కేటగిరీకి వెళ్లాలా? అనేది నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పించనుంది. తద్వారా వేగంగా నియామకాలు పూర్తిచేయాలని యోచిస్తోంది.