Telangana Income Decreased :కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్నులు, ఇతర మార్గాల్లో ఆదాయం భారీగా పెంచాలని అన్ని శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గత నెలతో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో నిర్ణయించిన లక్ష్యాల మేరకు పన్నుల ఆదాయం రాలేదు. ఎన్నికల నేపథ్యంలో ఆరు నెలలుగా తెలంగాణలో వాహనాలు, మద్యం వినియోగం పెరిగినా ఇంధనం, మద్యం అమ్మకాలపై పన్నుల ఆదాయంపెరగలేదు. వాటిపై వ్యాట్ రూపంలో రూ.39,500 కోట్లు రాబట్టాలని 2023-24లో ప్రభుత్వం అంచనా వేయగా కేవలం రూ.29,985 కోట్లు మాత్రమే వచ్చాయి. లక్ష్యం కంటే ఏకంగా రూ.9515 కోట్లు తగ్గడంపై తెలంగాణ సర్కార్ ఆరా తీస్తోంది.
GST Income in Telangana 2024 : ఉదాహరణకు పెట్రోల్, డీజిల్‌పై 2022-23లో వ్యాట్ ద్వారా రూ.15,342 కోట్లు రాగా 2023-24లోఅంతకన్నా రూ.73 కోట్లు మాత్రమే అదనంగా వచ్చాయి. ఎన్నికల వేళ వాహనాల వినియోగం చాలా ఎక్కువగా ఉన్నా ఆదాయం పెద్దగా పెరగలేదు. అదేవిధంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగినా వ్యాట్ రూపంలో 2022-23లో రూ.14,174 కోట్లు రాగా, గతేడాది 2023-24లో రూ.14,570 కోట్లు వచ్చాయి. ఇదే కాలవ్యవధిలో జీఎస్టీ పద్దు కింద వచ్చిన ఆదాయంలో 19 శాతం వృద్ధిరేటు నమోదైతే మద్యం అమ్మకాలు పెరిగినా వ్యాట్‌లో వృద్ధి కేవలం 3 శాతం లోపే ఉండడంపై ప్రభుత్వం విచారణ చేస్తోంది.
అప్పుల్లో మరింత దూకుడు - జనవరి నెలాఖరుకు నమోదైన రాష్ట్ర ఆదాయ, అప్పుల పూర్తి వివరాలివే
గత ప్రభుత్వం భారీగా అంచనా వేయడం : జీఎస్టీ, రిజిస్ట్రేషన్లపై వచ్చే ఆదాయం (Telangana Income)అంతకుముందు ఏడాదికన్నా స్వల్పంగా పెరిగినా బడ్జెట్ లక్ష్యాలు మాత్రం నెరవేరలేదు. అంతకుముందు సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని వృద్ధిరేటు వాస్తవిక దృక్పథంతో కాకుండా, బడ్జెట్‌లో గత ప్రభుత్వం భారీగా అంచనా వేయడంతో లక్ష్యాలు నెరవేరలేదని ప్రస్తుత సర్కార్ అభిప్రాయపడుతోంది. ఉదాహరణకు 2022-23లో జీఎస్టీ ద్వారా రూ.37,026 కోట్ల ఆదాయం రాగా 2023-24లో 10 శాతం పెరిగి రూ.40,650 కోట్లు వచ్చింది. కానీ గత సర్కార్ బడ్జెట్‌లో ఆ ఆదాయాన్ని రూ.50,942.66 కోట్లుగా అంచనా వేసింది. అంటే అంతకుముందు ఏడాదికన్నా ఏకంగా 37.58 శాతం పెరుగుతుందని లెక్కకట్టినా 10 శాతమే అదనంగా వచ్చింది.
Telangana Stamps and Registrations Revenue Decrease :స్టాంపులు- రిజిస్ట్రేషన్లపై ఆదాయ అంచనా లక్ష్యాలు నెరవేరలేదు. 2022-23లో ఆ పద్దు కింద రూ.14,291 కోట్ల రాబడి వచ్చింది. ఆ మొత్తం ఏకంగా 29.45 శాతం పెంచి గత ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.18,500 కోట్ల లక్ష్యం నిర్దేశించింది. కానీ ఎన్నికల ఏడాదిలో భూముల క్రయవిక్రయాలు తగ్గడం వల్ల రూ.14,483.05 కోట్లు వచ్చాయి. అంతకుముందు సంవత్సరం కంటే సుమారు 1.3 శాతం మాత్రమే వృద్ధి కనిపించింది.