Telangana High Court On Hydra Demolition :జన్వాడ ఫాంహౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఫాంహౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం, నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది. వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధి గురించి చెప్పాలని అదనపు అడ్వకేట్ జనరల్‌ను (ఏఏజీ) ధర్మాసనం సూచించింది. హైడ్రా కూల్చివేతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.
ఇప్పటి వరకు హైడ్రా ఎన్ని కట్టడాలు కూల్చివేసింది, ప్రతి కూల్చివేతలోనూ నిబంధనలు పాటించారా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలు ఎక్కువ అయ్యాయని ఏఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుని హైడ్రా పనిచేస్తుందని వివరించిన ఆయన స్థానిక సంస్థల ద్వారా నోటీసులు ఇచ్చాకే ఆక్రమణలు కూల్చివేస్తున్నట్లు స్పష్టం చేశారు.
60 గజాలైన, 60 ఎకరాలైనా సరే నిబంధనల ప్రకారమే కూల్చివేయాలి :ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, కొట్టివేయాలన్న ఏఏజీ అభ్యర్థించారు. చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ణయించారా అని ప్రశ్నించిన హైకోర్టు, 60 గజాలైన, 60 ఎకరాలైనా సరే నిబంధనల ప్రకారమే కూల్చివేయాలని నిర్దేశించింది. జన్వాడలోని ఫామ్‌హౌజ్ విషయంలో నిబంధనలను పాటించాలని హైకోర్టు పేర్కొంది.