Telangana High Court on TGPSC Group 1 Case : గ్రూప్1 నోటిఫికేషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తైంది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. గ్రూప్1 నోటిఫికేషన్‌తో పాటు ప్రిల్సిమ్స్ 'కీ'ని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు.
2022లో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని, ప్రాథమిక కీలో తప్పులున్నాయని వాటిని సవరించాలన్న అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. గతంలో గ్రూప్1 నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఇదే హైకోర్టు పరీక్షను రద్దు చేసిందని గుర్తుచేశారు. వందల పోస్టులను భర్తీ చేయడానికి నిర్వహిస్తున్న పరీక్షలకు లక్షల మంది ప్రిలిమ్స్ రాశారని, టీజీపీఎస్సీ వెలువరించిన తుది 'కీ'లో కూడా 7 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ ప్రశ్నలను తొలగించి తాజా 'కీ'ని రూపొందించి అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలని కోరారు.
గ్రూప్1 ప్రిలిమ్స్ రాసిన 3 లక్షల మంది అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కోరగా 721 మంది భౌతికంగా, 6470 అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించినట్లు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అభ్యంతరాలన్నింటినీ సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీకి పంపించి వాళ్ల ఆమోదం తర్వాతే ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు.
ఒకరిద్దరికి అర్థం కానంత మాత్రాన అవి తప్పులు కాదు : ప్రస్తుతం పిటిషన్లు దాఖలు చేసిన అయిదుగురిలో ఒక్కరు మాత్రమే కమిషన్‌కు అభ్యంతరాలు తెలిపారని టీజీపీఎస్సీ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రశ్నలకు విశ్లేషణాత్మకంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఒకరిద్దరికి అర్థం కానంత మాత్రాన అవి తప్పులు కాదని చెప్పారు. త్వరలో మెయిన్స్ పరీక్షలు జరగనున్నందున ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, దీనివల్ల అభ్యర్థులకు తీవ్రం నష్టం వాటిల్లుతుందన్నారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం టీజీపీఎస్సీకి ఉంటుందని న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్లను కొట్టేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.
'గ్రూప్-1 పాత నోటిఫికేషన్ రద్దు చేయకుండా - కొత్త నోటిఫికేషన్ చెల్లదు' - PETITIONS ON TG GROUP1 NOTIFICATION