Telangana HC On Mallareddy University : ఎలాంటి అనుమతుల్లేకుండా మల్లారెడ్డి యూనివర్సిటీ బాలానగర్‌లో ఏర్పాటు చేసిన ఆఫ్ క్యాంపస్ కేంద్రంపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు చేసింది. ఎలాంటి అనుమతులు లేకుండా దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్శిటీ బాలానగర్‌లో సెంటర్ ఆఫ్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఫర్ కామర్స్ అండ్ డిజైన్ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ నవీన ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, 'రాష్ట్ర ప్రభుత్వం యూజీసీల అనుమతులు లేకుండా ఆఫ్ క్యాంపస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయరాదు. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 25న ఈ కోర్టు జారీ చేసిన నోటీసులను పిటిషనర్ తరఫు న్యాయవాది అందజేస్తే మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు దానికి చెందిన ఆఫ్ క్యాంపస్ కేంద్రం కూడా తిరస్కరించాయి. నోటీసును తిరస్కరించడం అంటే తీసుకున్నట్లుగానే భావించాలి. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన కేంద్రంలో బీకాం, బీఎస్సీ కోర్సులకు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేపడుతున్నారు. వాటిని చేపట్టకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలి.' అని కోర్టును కోరారు.
ఈ వాదనలు విన్న న్యాయమూర్తి ఆఫ్ క్యాంపస్ కేంద్రం ఏర్పాటుకు యూజీసీ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు అవసరమని తెలిపారు. ఇదే విషయాన్ని పిటిషనర్‌తో పాటు ఎస్సీటీఈ, ఉస్మానియా యూనివర్సిటీల తరఫు న్యాయవాదులు కూడా ధ్రువీకరించారని చెప్పారు. నోటీసు జారీ చేసినప్పటికీ మల్లారెడ్డి యూనివర్సిటీ తరఫున ఎవరూ హాజరుకాలేదని, అంతేగాకుండా ఆఫ్ క్యాంపస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మల్లారెడ్డి యూనివర్సిటీకి ఎలాంటి అనుమతులు లేవని తేల్చిచెప్పారు.