TG High Court Serious On Dogs Issue : వీధికుక్కల దాడుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. శునకాల దాడుల నివారణకు సరైన చర్యలు చేపట్టడంలేదని హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన విక్రమాదిత్య దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయడంలేదని సరైన ఆహారం లేకపోవడం వల్ల మనుషులపై దాడి చేస్తున్నాయంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.
వీధికుక్కల సమస్యపై హైకోర్టు :గతేడాది ఫిబ్రవరి 19న హైదరాబాద్ బాగ్ అంబర్‌పేటలో పాఠశాల విద్యార్థిపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుంది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ జె. శ్రీనివాస రావులతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
Advocate General On Dogs Attacks :ఆనిమల్ బర్త్ కంట్రోల్ నిబంధనల ప్రకారం ఏబీసీ నిబంధనల అమలు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తూ జులై 18న జీవో 315 జారీ చేశామని అడ్వోకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. పలు జంతు సంక్షేమ సంస్థలను కలిసి కుక్కల దాడుల నియంత్రణకు సలహాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులు, ప్రజారోగ్యశాఖ ప్రతినిధులు, ఏబీసీ కేంద్రాల సభ్యులు, మాస్టర్ ట్రైనర్లతో జులై 22న సమావేశం నిర్వహించి సూచనలు సలహాలు తీసుకున్నట్లు తెలిపారు.
TG High Court Orders To GHMC :ఏబీసీ నిబంధనల ప్రకారం జీహెచ్ఎంసీ సహా స్థానిక సంస్థల్లో తగినన్ని షెల్టర్లు, వెటర్నరీ ఆస్పత్రులు, కుక్కల తరలింపునకు వ్యాన్లు, శస్త్రచికిత్స ఉపకరణాలు ఉండాలని నిర్దేశించింది. అన్ని వసతులతో మొబైల్ ఆపరేషన్ థియేటర్ వ్యాన్లు, ఆపరేషన్ తరువాత జంతువులను ఉంచడానికి సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉందని ధర్మాసనం తెలిపింది.
ఏబీసీ కేంద్రాలు ఏర్పాటు చేయండి :నిబంధనల ప్రకారం ఏబీసీ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ సీసీటీవీలు ఏర్పాటు చేయాలని కుక్కలను పట్టుకోవడం, విడుదల, మందులు, సర్జరీ, ఆహారం, వ్యాక్సినేషన్ ఏబీసీ కేంద్రాల్లో నిర్వహించాలని హైకోర్టు తెలిపింది. వీటిని జంతు సంక్షేమ సంస్థలు నిర్వహిస్తున్నట్లయితే ఖర్చులను స్థానిక సంస్థలు చెల్లించాల్సి ఉందని తెలిపింది.