Telangana HC On Ews Quota MBBS Admissions: ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పనకు మార్గదర్శకాలు రూపొందించకపోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శకాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు : 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పనపై మార్గదర్శకాలు జారీ చేయాలంటూ జనవరి 1న కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసినా స్పందించకపోవడాన్ని సవాలు చేస్తూ బీజేపీకి చెందిన కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు :ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాదే, జస్టిస్ జె.శ్రీనివాస రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆగస్టు 28న తాను వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్ఎంసీ నోటిఫికేషన్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయాల్సి ఉందన్నారు.