Geographical Indication For Hyderabad Pearls : హైదరాబాద్‌లో లాడ్‌బజార్ లక్క గాజులు, ముత్యాలకు ప్రత్యేకత ఉంది. ఇప్పటికే లక్కగాజులకు భౌగోళిక గుర్తింపు లభించగా ముత్యాల కోసం తయారీ దారులు ధరఖాస్తు చేసుకున్నారు. వీరి దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వ మేధోహక్కుల సంపత్తి అనుబంధ విభాగమైన జియోగ్రాఫికల్ ఇండెక్స్ రిజిస్ట్రీ కార్యాలయానికి చేరేలా హైదరాబాద్‌కు చెందిన జీఐ ప్రాక్టీషినర్ సహకరిస్తున్నారు.
జియోగ్రాఫికల్ ఇండెక్స్ లభించడం ద్వారా : సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక మేధో సంపత్తి హక్కులకు ప్రాధాన్యం ఎక్కువగా ఏర్పడింది. మేధో సంపత్తి హక్కులకు అనుబంధ విభాగాలైన పేటెంట్లు, భౌగోళిక గుర్తింపు వంటివి మరింత ఆదరణ పొందాయి. వస్తువులకు, కళారూపాలకు భౌగోళిక గుర్తింపు లభిస్తే అంతర్జాతీయంగా వాటికి విలువ పెరుగుతుంది. భౌగోళిక గుర్తింపు(జియోగ్రాఫికల్ ఇండెక్స్) కారణంగా కళారూపాలను అమ్మినప్పుడు తయారీదారులకు ఎక్కువ లాభం వస్తుంది. రెండు, మూడు దశాబ్దాలుగా భౌగోళిక గుర్తింపుపై అవగాహన పెరుగుతోంది.
ముత్యాలతో పాటు మరికొన్ని జీఐ ట్యాగ్ కోసం దరఖాస్తులు : హైదరాబాద్‌లో ముత్యాలకు ఇప్పటికీ ప్రాధాన్యముంది. నాలుగు వందల ఏళ్ల నుంచి వందల కుటుంబాలు ముత్యాలను తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. ఈ ముత్యాలకు ఇప్పటి వరకూ భౌగోళిక గుర్తింపు దక్కలేదు. ఒక్కసారి జీఐ ట్యాగ్ వస్తే అసలైన ముత్యాలకు మరింత గిరాకీ పెరుగుతుందని తయారీదారులు తెలుపుతున్నారు. హైదరాబాద్ ముత్యాలతో పాటు నిజామాబాద్ పసుపు, నారాయణపేట వజ్రాభరణాల తయారీ, నల్గొండ జిల్లా బంజారా నీడిల్ క్రాఫ్ట్, తిరుపతి జిల్లా మాధవమాల గ్రామ కల్యాణ బాలాజీ విగ్రహాలు, పలమనేరు టెర్రాకోటకు భౌగోళిక గుర్తింపు(జియోగ్రాఫికల్ ఇండెక్స్) కోసం తయారీదారులు దరఖాస్తులు చేసుకున్నారు.
"సంప్రదాయ కళారూపాలు మరింత ప్రాచుర్యం పొందేందుకు, కళాకారులు ఆర్థికంగా ఎదిగేందుకు, మరింతమందికి జీవనోపాధి లభించేందుకు భౌగోళిక గుర్తింపు(జీఐ ట్యాగ్) ఉపకరిస్తుంది. కళారూపాలను వేలమంది తయారు చేస్తున్నా.. జీఐ ట్యాగ్ పొందాలంటే వాటిల్లో కొత్తదనం, వినూత్నం ఉండాలి. జీఐట్యాగ్ లభించాక బ్రాండ్‌గా మారుతుంది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో గిరాకీ లభిస్తుంది."-శుభజిత్ సాహా, జీఐ ప్రాక్టీషనర్, హైదరాబాద్
మధురమైన 'బాలానగర్ సీతాఫలానికి' దక్కేనా జీఐ ట్యాగ్ - దరఖాస్తు చేయనున్న ఉద్యాన యూనివర్సిటీ
హైదరాబాద్‌కు మరో గౌరవం - ఓల్డ్ సిటీ లక్క గాజులకు భౌగోళిక గుర్తింపు