TG HC on RTE and Law Course Counselling : ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యా హక్కు చట్టం ప్రకారం 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాలని, లా కోర్సులకు సకాలంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని దాఖలైన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయినా రాష్ట్రంలో దాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సులకు కౌన్సిలింగ్‌లను సకాలంలో నిర్వహించకపోవడం వల్ల విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారంటూ న్యాయవాదులు తాండవ యోగేష్, భాస్కర్ రెడ్డి వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై మరోసారి విచారణ నిర్వహించింది.
విద్యాహక్కు చట్టం అమలుపై న్యాయస్థానం : పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో 25శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని, ఫీజులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చెల్లించాలని విద్యాహక్కు చట్టంలో ఉందని పిటిషనర్ తాండవ యోగేష్ ధర్మాసనానికి తెలిపారు. విద్యాహక్కు చట్టం అమలు తీరు గురించి వివరాలందించడానికి సీనియర్ న్యాయవాది సునీల్‌ను హైకోర్టు అమికస్ క్యూరీగా నియమించింది. ఇతర రాష్ట్రాల్లో విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తున్నట్లు అమికస్ క్యూరీ సునీల్ ధర్మాసనానికి తెలిపారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ అఫిడవిట్ దాఖలు చేశారు. కర్ణాటకలో అమలవుతున్న విధానాన్ని పరిశీలిస్తున్నామని ఆయన కోర్టుకు తెలిపారు.