తెలంగాణ

telangana

ETV Bharat / state

అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు లేదు : హైకోర్టు - HC ON ASSIGNED LANDS REGISTRATION

అసైన్డ్​ భూముల అక్రమ బదిలీలపై హైకోర్టు సీరియస్​ - అలాంటి భూములు​ రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్​రిజిస్ట్రార్లకు లేదని స్పష్టీకరణ - విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలి కలెక్టర్​ను ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం​

High Court On Assigned Lands Registration
High Court On Assigned Lands Registration (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2025, 12:46 PM IST

High Court On Assigned Lands Registration :కొంత మంది మోసగాళ్లు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులతో కుమ్మక్కై అమాయకులను మోసం చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అసైన్డ్ భూములను భూమార్పిడి చేసి విక్రయిస్తుంటారని తెలిపింది. అసైన్డ్ భూములని తెలియక నిజాయితీగా కొనుగోలు చేసినవారు మోసపోతున్నారని హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. చట్టప్రకారం అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అసైన్డ్ భూముల ఆక్రమ బదిలీకి బాధ్యులైన అధికారులు చట్టప్రకారం శిక్షార్హులని తెలిపింది.

అసైన్డ్​ భూముల విక్రయాలపై హైకోర్టు :అమాయకమైన కొనుగోలుదారులు అసైన్డ్ భూములన్న వాస్తవం తెలియకుండా కష్టార్జితాన్ని వెచ్చించి భూములను కొనుగోలు చేస్తున్నారని దీనిని ఆసరా చేసుకొని కొంత మంది మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారని హైకోర్టు పేర్కొంది. 1977 అసైన్డ్ చట్టం నిబంధనల ప్రకారం ఏదైనా కారణంగా అసైన్డ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే నిజాయితీగా కొనుగోలు చేసిన వాళ్లకు నష్టం వాటిల్లుతోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. మోసగాళ్లు అధికారులతో కుమ్మక్కై తమ స్వాధీనంలో లేని, ఎలాంటి విక్రయ దస్తావేజులు లేని భూములనూ విక్రయిస్తుంటారంది.

అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్​ చర్యలు :రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో అసైన్డ్ భూమి/లావణి పట్టా భూమి విక్రయంపై మూడు నెలల్లో విచారణ జరిపి అవకతవకలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను అద్దేశించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ సర్వే నెం 176/23లో 33 గుంటల లావణి పట్టా భూమిని తమ అంగీకారం లేకుండా మరొకరికి విక్రయించడంపై నాగమ్మ ఆమె ముగ్గురు కుమారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సి.వి.భాస్కర్​ రెడ్డి విచారణ చేపట్టారు.

తన భర్త మరణాంతరం ఆయన పేరుమీద ఉన్న అసైన్డ్ భూమిని నలుగురు కుమారులు మరో వ్యక్తికి 2021లో విక్రయించారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విక్రయించేముందు తల్లితోపాటు ఇతర వారసుల అంగీకారం తీసుకోలేదన్నారు. ఆసైన్డ్ భూమి/లావణి ఫట్టా అన్న విషయాన్ని తొక్కిపెట్టి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేసి విక్రయించారన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1317 ఫనలీ ప్రకారం ఆసైన్డ్ భూమిని వ్యవసాయానికి మాత్రమే వినియోగించాల్సి ఉందన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే స్వాధీనం చేసుకోవచ్చు :ఏమైనా షరతులను ఉల్లంఘించినట్లయితే అసైన్డ్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చన్నారు. తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం సెక్షన్ 5(1) ప్రకారం కలెక్టర్ లేదంటే ఎమ్మార్వో స్థాయికి తగ్గని అధికారులు అసైన్డ్ భూముల జాబితాను రిజిస్ట్రేషన్ అధికారులకు అందజేయాల్సి ఉందన్నారు. నిబంధనల ప్రకారం అసైన్డ్ భూములను రిజిస్టర్ చేసే అధికారం సబ్​రిజిస్ట్రార్​కు లేదన్నారు. అసైన్డ్ చట్టం ప్రకారం ఏ అధికారి అయినా నిబంధనలను ఉల్లంఘిస్తే ఆరు నెలల సాధారణ జైలు, 10వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చన్నారు.

ప్రాథమికంగా చూస్తే ఆసైన్డ్ భూములని తెలియక అమాయక కొనుగోలుదారుల తమ కష్టార్జితాన్ని ధారపోసి భూములను కొనుగోలు చేసి నష్టపోతున్నారన్నారు. ప్రస్తుత కేసులో పిటిషనర్లు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించాలని ఆదేశించారు. వినతి పత్రం అందిన మూడు నెలల్లోగా దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేశారు.

నాగారంలోని ఆ భూములపై వివరాలివ్వండి - రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సర్వే నిర్వహించి సరిహద్దులను నిర్ణయించే అధికారం సర్వేశాఖకు ఉంది : హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details