Telangana High Court on 2008 DSC Recruitments :డీఎస్సీ 2008 అభ్యర్థుల పిటీషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. 2008 డీఎస్సీకి సంబంధించి 1382 పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, అది పూర్తయ్యేదాకా గడువు ఇవ్వాలంటూ ప్రభుత్వం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ ఈడ తిరుమలాదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి వాదనలు : 2008 డీఎస్సీలో భర్తీకాని ఎస్టీటీ పోస్టులను ఏపీలో వలె అర్హత సాధించిన బీఈడీ అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం చేపట్టాలన్న హైకోర్టు 2024 ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. సబ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం నియామకాలు చేపట్టడానికి సిద్ధంగా ఉండన్నారు. 2008 డీఎస్సీలో అర్హత పొందిన అభ్యర్థులు 2367 మందికిగాను 1382 మంది కాంట్రాక్ట్ నియామకాలకు ఆసక్తి చూపారని, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయితే గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ను జనవరి 23న విడుదల చేసిందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, గడువు ముగిసిన వెంటనే నియామక ప్రక్రియను కొనసాగిస్తామన్నారు.
విచారణ10వ తేదీకి వాయిదా :అయితే దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ 2008 నుంచి నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని, ఇప్పుడు మళ్లీ ఎన్నికల ప్రవర్తనా నియామవళి అంటూ వాయిదా వేస్తారా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తమ ఉత్తర్వుల ప్రకారం నియామకాలు చేపట్టాల్సిందేనని హైకోర్టు ఏజీని ఆదేశించింది. నియామకాలు చేపట్టకుండా ఎన్నాళ్లిలా వాయిదా వేస్తూ వస్తారంది. ఇది వరకు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనని, పాత నోటిఫికేషన్‌కు ఎన్నికల ప్రవర్తనా నియమావళితో ముడిపెట్టరాదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై గడువు పొడిగించే ప్రసక్తే లేదని, ఇందులో ఎలాంటి కారణాలు చెప్పొందంది. ఇప్పటికే నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారని, ఇంకా వాయిదా వేయడం సరికాదని హైకోర్టు పేర్కొంది. నియామకాలు చేపట్టకపోతే తదుపరి విచారణకు ఉన్నతాధికారులు హాజరుకావాల్సి ఉంటుందంటూ హైకోర్టు పేర్కొంది. 2008 డీఎస్సీ అభ్యర్థుల పిటీషన్లపై హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది.