తెలంగాణ

telangana

ETV Bharat / state

73 ఏళ్ల నాటి కేసును పరిష్కరించి చరిత్రలో నిలిచిన తెలంగాణ హైకోర్టు - ఇంతకీ ఏంటది? - Nawab Fakhrul Mulk Properties case - NAWAB FAKHRUL MULK PROPERTIES CASE

Nawab Fakhrul Mulk Properties Case : 73 ఏళ్ల నాటి నవాబ్​ ఫక్రుల్​ ముల్క్​ వారసుల భాగ పంపిణీ వివాదం కేసుకు తెలంగాణ హైకోర్టు తెర దించింది. ఈ కేసును పరిష్కరించి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఈ వివాదంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆలోక్​ అరాధే, జస్టిస్​ ఎన్​వి శ్రవణ్​కుమార్​లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పును వెలువరించింది.

Nawab Fakhrul Mulk Properties Case in Hyderabad
Nawab Fakhrul Mulk Properties Case in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Apr 28, 2024, 11:51 AM IST

Nawab Fakhrul Mulk Properties Case in Hyderabad : అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్​ ఫక్రుల్​ ముల్క్​ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు ఫుల్​స్టాప్​ పెట్టింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది. అంతకు ముందు 72 ఏళ్లుగా దేశంలోనే అత్యంత పాత కేసుల్లో ఒకటైన బెర్హంపూర్​ కేసును కలకత్తా హైకోర్టు గతేడాది పరిష్కరించగా, ఇప్పుడు 73 ఏళ్ల కేసును పరిష్కరించి తెలంగాణ హైకోర్టు చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఈ వివాదంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆలోక్​ అరాధే, జస్టిస్​ ఎన్​వి శ్రవణ్​కుమార్​లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పును వెలువరించింది.

అసలేంటి వివాదం : 1951లో నవాబ్​ ఫక్రుల్​ ముల్క్​కు చెందిన వారసత్వ భూమి పంపిణీ వివాదంలో హైకోర్టు మూడు రాజీ పిటిషన్​ల ద్వారా ప్రాథమిక డిక్రీ జారీ అయింది. దీని ప్రకారం ఐదు భాగాలుగా ఐదుగురికి నగరంలో ఉన్న 9 ఆస్తుల పంపిణీ జరగాలి. అవిర ఎర్రమంజిల్​, ఎర్రగడ్డ, బొల్లారం, బల్దా, బెహ్లూల్​ఖాన్​గూడ, యూసఫ్​గూడ, మూసాపేటలలో ఉన్నాయి. ఆ భూముల పరిరక్షణతో పాటు విక్రయించి వాటాలు పంచడానికి గానూ ఇప్పటిదాకా 9 మంది రిసీవర్లు నియమితులయ్యారు. అప్పటి నుంచి ఒక్కో ఆస్తిని పంచే క్రమంలో తిరిగి వివాదాలు, కేసులు వచ్చాయి. కొంత ఆస్తిని వారసులకు భాగ పంపిణీ చేయగా, ప్రభుత్వం కూడా కొంత భూమిని సేకరించి పరిహారాన్ని ఇవ్వగా దానిని కూడా వారసులకు పంచారు.

ఆ క్రమంలోనే ఎర్రగడ్డలోని ఎర్రం నూమా బంగ్లాకు సంబంధించిన 59 ఎకరాలను సేకరించి ప్రభుత్వ టీబీ ఆసుపత్రి నిర్మించింది. ఇంకా ఆస్తి పంపకం వ్యవహారం ఇంకా తెగకపోవడంతో 2022 నవంబరు 29న విశ్రాంత జిల్లా జడ్జి మహమ్మద్​ నిజాముద్దీన్​ను చివరిగా రిసీవర్​ కమ్​ కమిషనరుగా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులను ఇచ్చింది. ఆయన గత ఏడాది మార్చి 16న తుది నివేదికను న్యాయస్థానానికి సమర్పించగా, అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయాలని హైకోర్టు బార్​ అసోసియేషన్​కు నోటీసు జారీ చేసింది. కానీ కొంత మంది మాత్రమే అభ్యంతరాలు తెలిపారు.

ఒకటో తరగతికి కనీస వయసుపై పిల్ - కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు

శ్మశానం తప్ప ఏమీ మిగల్లేదు : రిసీవర్​ సమర్పించిన నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆలోక్​ అరాధే, జస్టిస్​ ఎన్​వీ శ్రవణ్​కుమార్​లతో కూడిన ధర్మాసనం ఆమోదం తెలిపింది. వాస్తవానికి పంపిణీ చేయడానికి అమీర్​పేటలోని శ్మశాన భూమి తప్ప ఇంకేమీ మిగలలేదని రిసీవర్​ నివేదికలో పేర్కొన్నారు. అయినా భూములున్నాయని వాటి భాగ పంపిణీ కాలేదంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసిన వాటిని ధర్మాసనం తోసిపుచ్చింది. నిర్దిష్ట వివరాలు సమర్పించకుండా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేమని తెలిపింది. ఇన్నేళ్లు తర్వాత ఇప్పుడు కొత్త కారణాలతో ఇంకా భాగ పంపిణీ జరగాల్సి ఉందని ఎలా చెబుతారు అంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. క్లెయిం తీసుకోనివారు నగదు తీసుకోవచ్చని చెప్పింది.

భూముల విక్రయం ద్వారా వచ్చిన సొమ్ము 2023 మార్చి 10 నాటికి రూ.1,19,81,249 హైకోర్టు వద్ద ఉన్నాయని, ఆ నగదును జాతీయ బ్యాంకులో ఫిక్స్​డ్​ డిపాజిట్​ చేయాలని రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశించింది. వారి వాటాను క్లెయిం చేసుకోని వారు చెక్​ పిటిషన్​ దాఖలు చేసి సొమ్మును వడ్డీ సహా తీసుకోవచ్చని తీర్పులో పేర్కొంది. అమీర్​పేటలో ఉన్న శ్మశానవాటికను కేంద్రం చారిత్రక ప్రదేశంగా గుర్తించిందని తెలిపింది. ముల్క్​ వారసులు ఓ కమిటీ ఏర్పాటు చేసుకుని దాన్ని పరిరక్షించాలని సూచించింది. అంతేగానీ స్థలం పంపకం జరగడానికి వీల్లేదని తీర్పును వెలువరించింది. ఈ కేసులో 73 ఏళ్లుగా రికార్డులను భద్రపరిచిన హైకోర్టు రిజిస్ట్రీని ధర్మాసనం అభినందించింది.

పెండింగ్​లో మరో మూడు పాత కేసులు : తెలంగాణ హైకోర్టులో నిజాం నవాబులు, పైగా భూములకు సంబంధించిన మరో మూడు పాత కేసులు పెండింగ్​లో ఉన్నాయి. ఈ కేసుల్లో వారసుల నుంచి పవర్​ ఆఫ్​ అటార్నీతో కొనుగోలు చేశామని, వాటిపై హక్కులు తమకూ ఉన్నాయంటూ బడా వ్యక్తులు మధ్యంతర పిటిషన్​ల మీద పిటిషన్​లు దాఖలు చేస్తూ సుప్రీంకోర్టు వరకు కూడా వెళుతున్నారు. అసలైన పిటిషన్​ పెండింగ్​లో ఉండగా మధ్యంతర పిటిషన్​లతో వివాదాలు పెరుగుతున్నందున వాటిని తెరదించాలన్న లక్ష్యంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆలోక్​ అరాధే, జస్టిస్​ ఎన్​వీ శ్రవణ్​కుమార్​లతో కూడిన ధర్మాసనం విచారణను చేపడుతోంది.

ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలు, అప్లికేషన్​ ప్రాసెస్​ ఇదే!

చెరువుల కబ్జాతో ముప్పే - హైకోర్టుకు న్యాయమూర్తి లేఖ - స్వీకరించిన న్యాయస్థానం

ABOUT THE AUTHOR

...view details