Minister Damodar Raja Narasimha about Sports :అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. అధైర్యం, అభద్రతకు గురికాకూడదని, కాన్ఫిడెంట్‌గా అన్నిరంగాల్లో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. Freedom is Our Birth Right అని వ్యాఖ్యానించారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా అందోల్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పదో జోనల్ స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థినులకు మంత్రి బహుమతులు అందజేశారు. అనంతరం క్రీడాకారులతో కలిసి సరదాగా కాసేపు కబడ్డి ఆడి అక్కడున్న అందరిని ఉత్సాహపరిచారు.
ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఆటల్లోనైనా, జీవితంలోనైనా గెలుపోటములు సహజమని అన్నారు. స్పోర్టీవ్‌గా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. మరోసారి ఆడి గెలిచేందుకు శక్తిని కూడదీసుకుని సాధన చేయాలని చెప్పారు. ప్రస్తుతం చదువుల్లో పడి క్రీడలను నిర్లక్షం చేస్తున్నారని, కానీ విద్యతోపాటు కల్చర్, స్పోర్ట్స్ కూడా చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.
'అకాడమిక్ బుక్స్‌తో పాటు, చరిత్రకు సంబంధించిన పుస్తకాలు కూడా చదవాలి. మీ స్కూల్‌లో లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. అన్ని బుక్స్ అందజేస్తాం. మీకు కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని కల్పిస్తాం. ప్రతి స్టూడెంట్ లైబ్రరీకి వెళ్లాలి. మీకు నచ్చిన పుస్తకం చదవాలి'-దామోదర్ రాజనర్సింహ, ఆరోగ్య శాఖ మంత్రి