Telangana Govt Working to Implement Farmer Loan Waiver :ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల పంట రుణాలను మాఫీ(Rythu Runa Mafi) చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రూ.2 లక్షలు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో మేనిఫెస్టోను విడుదల చేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా ఇటీవల బడ్జెట్ ప్రసంగంలోనూ ఈ అంశాన్ని పొందుపరిచారు. ఇచ్చిన హామీ మేరకు రైతులను రుణ విముక్తులను చేస్తామని పేర్కొంది. రుణమాఫీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది.
రాష్ట్రంలోని బ్యాంకర్లతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించి రైతుల రుణాల మాఫీవిషయమై రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. రెండు లక్షల రూపాయల్లోపు రైతుల అప్పుల మొత్తం రూ.35 వేల కోట్ల వరకు ఉంటుందని ఓ అంచనా. అంత భారీ మొత్తం ఒకేమారు చెల్లించే అవకాశం లేదు. దీంతో ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల నుంచి ప్రభుత్వానికి బదిలీ చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సర్కార్‌కు వివిధ రూపాల్లో వచ్చే ఆదాయాన్ని దానికి కొంత మేర జమయ్యేలా చూడాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ దిశగా ఆర్థిక శాఖ కసరత్తు చేసింది.
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు, ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పొంతనలేదు : కడియం శ్రీహరి
Rythu Runa Mafi in Telangana :రిజర్వు బ్యాంకు(RBI)తో కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు సంప్రదింపులు జరిపారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దాన్ని ఎఫ్ఆర్బీఎం(FRBM) పరిధిలోకి రాకుండా చూసేలా చర్చలు జరుపుతున్నారు. బుధవారం నాటి కొడంగల్ సభలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించారు. త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అన్న సీఎం ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల వరకు రుణాల మాఫీ చేసి రైతులను విముక్తులను చేస్తామని ప్రకటించారు.