Telangana Govt To Start Indiramma Houses on Diwali :దీపావళి పండుగ కానుకగా ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీపాల పండుగ రోజు అమావాస్య కాబట్టి, ఆ తర్వాత మంచిరోజు చూసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ గృహాలను నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా గ్రామ సభలు నిర్వహించి, బహు పేదలను పారదర్శకంగా ఎంపిక చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శనివారం దాదాపు 4 గంటలకు పైగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలిపారు. ఆ వివరాలను మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ మీడీయా సమావేశంలో వెల్లడించారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు - లబ్ధిదారుల ఎంపిక కోసం దసరా నాటికి కమిటీలు - CM Revanth On Indiramma Houses
- 2020 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉండగా, వాటిల్లో ఒకటి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఉద్యోగ సంఘాలు సంతోషంగా స్వీకరించాలని, ఆర్థిక పరిస్థితి కుదుటపడగానే అన్నీ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.
- 317 జీవో, 46 జీవోలపై సర్కార్ వేసిన సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. దూర ప్రాంతాల్లో ఉంటున్న ఉద్యోగులకు సంబంధించిన మెడికల్, స్పౌజ్, మ్యూచువల్ బదిలీలను మంత్రివర్గం ఆమోదించింది. స్థానికత అంశం రాష్ట్రపతి పరిధిలో ఉన్నందున, న్యాయసలహా తీసుకొని అసెంబ్లీలో చర్చించి ముందుకు వెళ్లాలని మంత్రివర్గం నిర్ణయించింది.
- నవంబరు 30 వరకు రాష్ట్రంలో కుల గణన సర్వే పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు తెలిపారు. నవంబర్ 4 నుంచి 19 వరకూ రాష్ట్రమంతటా ఇంటింటి సర్వే చేపట్టానున్నారని దీనికి దాదాపు 80వేల ఎన్యూమరేటర్లను సర్వే విధులకు డిప్యూట్ చేస్తారని చెప్పారు. వారికి త్వరలో శిక్షణ ఇస్తారని, సోమవారం నుంచి జిల్లా కలెక్టర్ల సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు. ఒక్కో ఎన్యూమరేటర్ నిర్ణీత గడువు లోగా 150 ఇళ్ల నుంచి వివరాలు సేకరిస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలను, ప్రశ్నావళిని క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. సమగ్ర సమాచారాన్ని సేకరించబోతున్నట్లు చెప్పారు. ఆ వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతారని దానికి అందరూ స్పందించాలన్నారు.
- ధాన్యం సేకరణకు సుమారు 6 వేలకు పైగా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే కొన్ని ఏర్పాటయ్యాయని చెప్పారు. మరికొన్నింటిని త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై కీలక అప్డేట్ - వచ్చే వారం అందుబాటులోకి ప్రత్యేక యాప్
రాష్ట్ర ప్రజలకు శుభవార్త - అక్టోబరు 15 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక - Indiramma Housing Scheme oct 02