Family Digital Cards Pilot Project in telangana : కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు నేటి నుంచి ఈ నెల 7 వరకు చేపట్టనున్నారు. ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతీ కుటుంబానికి ఒక ప్రత్యేక నంబరుతో కార్డు ఇవ్వనున్నారు. రేషన్ కార్డు, రైతు బంధు, ఫించను తదితర సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా ఇప్పటికే కుటుంబసభ్యుల వివరాలు గుర్తించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా నేటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకుంటారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని 238 ప్రాంతాల్లో ఇంటింటి పరిశీలన జరగనుంది.
ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామీణ, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. పూర్తి గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గంలో రెండు గ్రామాలు, పూర్తిగా పట్టణ, నగర ప్రాంతాల్లో రెండు వార్డులు లేదా డివిజన్లలో పైలట్ ప్రాజెక్టు చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారుల బృందాలు కుటుంబాలను నిర్ధారించడంతో పాటు కొత్త సభ్యులని చేర్చి, మరణించిన వారి పేర్లు తొలగిస్తారు. పైలట్ ప్రాజెక్టును సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
కుటుంబం ఒప్పుకుంటేనే ఫొటో : కుటుంబంలోని ప్రధాన మహిళను యజమానిగా పేర్కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలను కార్డు వెనుక ప్రచురించనున్నారు. కుటుంబ సభ్యులంతా అంగీకరిస్తేనే కుటుంబ ఫొటో తీయాలని, అది ఐచ్చికంగా మాత్రమే ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కుటుంబసభ్యులు ఒప్పుకోకపోతే ఫొటో తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు వంటి వివరాలు అడగవద్దని తెలిపారు. ఇప్పటికే కార్డులు ఇచ్చిన రాజస్థాన్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్రలో గత నెల 25 నుంచి 27 వరకు అధికారులు పర్యటించి పరిశీలించారు. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ డిజిటల్ కార్డు అంశాలు ఉపయోగకరంగా ఉంటే స్వీకరించాలని అధికారులకు సీఎం సూచించారు.