SLBC Tunnel Collapse Update : శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారిని వెలికితీసే సహాయక చర్యల్లో కాస్త పురోగతి కనిపించింది. మంగళవారం మధ్యాహ్నం సొరంగంలోకి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్‌హోల్ మైనర్స్ సభ్యులు ఎట్టకేలకు మనుషులు వెళ్లగలిగేంత చివరి వరకూ వెళ్లి తిరిగి వచ్చారు. శనివారం ఉదయం సొరంగంలోని14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ బోరింగ్ మిషన్‌పై సెగ్మెంట్లు ధ్వంసమై మట్టి, నీరు కుప్పకూలడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద ధాటికి టీబీఎం మిషన్‌లోని వెనక భాగం అర కిలోమీటర్ వరకు కొట్టుకుని రాగా TBM ముఖద్వారంలో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు శని వారం నుంచి విస్తృతమైన సహయక చర్యలు చేపట్టారు.
14 కిలోమీటర్లున్న సొరంగంలో 13.5 కిలోమీటర్ల వరకు లోకోట్రైన్ సాయంతో సహాయక బృందాలు వెళ్తున్నాయి. అక్కడ ధ్వంసమైన టీబీఎం అవశేషాలు అడ్డంకిగా మారాయి. పది నుంచి 11.5 కిలోమీటర్ల మధ్య 2 అడుగుల ఎత్తులో నీరుంది. టీబీఎం(TBM) మిషన్ దాటిన తర్వాత 100 మీటర్ల మేర బురద పేరుకుపోయి ఉంది. అక్కడి వరకూ వెదురు బొంగులు, థర్మాకోల్ షీట్స్‌తో చేసిన ఫిషింగ్ బోట్లు ఉపయోగించి సహాయక బృందాలు వెళ్లగలుగుతున్నాయి. ఆ తర్వాత 40 మీటర్ల మేర దట్టమైన బురద సుమారు ఆరేడు అడుగుల ఎత్తులో పేరుకుపోయి ఉంది. ఆ అడ్డంకికి దాటితేనే ప్రమాదానికి గురైన టీబీఎం ముందు భాగం, అందులో చిక్కుకుపోయిన 8 మందిని గుర్తించే అవకాశం ఉంది.
లోపల కుప్పకూలే ప్రమాదం : కాగా మనుషులు వెళ్లగలిగేంత వరకూ ర్యాట్ హోల్ మైనర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లి వచ్చాయి. లోపలి మట్టిని తొలగించినా సెగ్మెంట్లు దెబ్బతిన్న కారణంగా మళ్లీ కుప్పకూలే ప్రమాదం ఉందని ర్యాట్‌హోల్ మైనర్స్ బృందం వెల్లడించింది. అక్కడి పరిస్థితిని బట్టి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తొలుత సొరంగంలో భారీ ఎత్తున పేరుకుపోయిన నీరు అడ్డంకిగా మారింది. నీళ్లు తోడేసిన తర్వాత శిథిలమైన టీబీఎం ప్రతిబంధకమైంది. కన్వేయర్ బెల్టు సాయంతో ఎలాగోలా దాన్నీ దాటేసినా టీబీఎం మొదటి భాగానికి చివరి భాగానికి మధ్య ఐదారడుగులు ఎత్తులో నిలిచిన మట్టి, బురద, నీటి ఊట ప్రధాన ఆటంకాలుగా మారాయి. టీబీఎం ముఖద్వారానికి చేరుకోవాలంటే శిథిలాలను తొలగించి పూడుకపోయిన మట్టిని ఎత్తివేయాలి.
మరో మార్గం ఉందా టన్నల్ బోరిన్ వద్దకు వెళ్లడానికి : ఎత్తే క్రమంలో మళ్లీ కుప్పకూలకుండా చర్యలు తీసుకోవాలి. అదీ సాధ్యం కాదనుకున్నప్పుడు మరో మార్గం ద్వారా టన్నల్ బోరింగ్ మిషన్‌కు చేరుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకూ సొరంగంలోకి చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు పుష్ కెమెరాలు, డ్రోన్లు, స్నీపర్ డాగ్‌లు, నీటిలో మానవ శరీరాన్ని గుర్తించే పరికరాలు, భారీ శబ్దాలు చేసి మిషన్లు ఇలా ఎన్నిరకాల ప్రయోగాలు చేసినప్పటికీ లోపల చిక్కుకున్న వారి జాడ ఎక్కడుందో తెలియరాలేదు.
"ఇవాళ ఇండియన్ నేవీ, ఎన్డీఆర్ఎఫ్తో కూడిన బృందాలతో పాటు జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్జీఆర్ఐ, బీఆర్ఓ(BRO)కు చెందిన నిపుణులు సైతం రంగంలోకి దిగుతున్నారు. ఇక 12 కిలోమీటర్ల వద్ద పై నుంచి గాని, పక్క నుంచి గాని టన్నెల్‌లోకి వెళ్లేలా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేంత వరకు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉంటాయి." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి
సహాయక చర్యలపై బాధితుల కుటుంబ సభ్యులు అసంతృప్తి : ఎస్ఎల్బీసీలో కొనసాగుతున్న సహాయక చర్యలపై బాధితుల కుటుంబ సభ్యులు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొదట నీళ్లున్నాయని, తర్వాత బురద ఉందని చెప్పారని, మూడు రోజులు వేచి చూసినా ఫలితం లేదని గురుప్రీత్ సింగ్ బావమరిది సత్పాల్ సింగ్ ఆరోపించారు. సరైన అధికారులను నియమించి వీలైనంత త్వరగా చిక్కుకున్న వారిని వెలికి తీయాలని విజ్ఞప్తి చేశారు.
ఆ ఎనిమిది మందిని బయటకు తీసుకురావడానికి సర్వశక్తులు ఉపయోగిస్తాం - మంత్రుల బృందం