TB Vaccination Drive in Telangana 2024 :తెలంగాణలో క్షయ(టీబీ) వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 సంవత్సరాలు పైబడినవారికి బీసీజీ టీకా కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శ్రీకారం చుడుతోంది. తొలి దశలో రాష్ట్రంలో ఎంపిక చేసిన 17 జిల్లాల్లో గుర్తించిన సుమారు 60 లక్షల మందికి ఒక డోసు టీకా ఇచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. జులై చివరివారం లేదా ఆగస్ట్ మొదటివారంలో ఇది ప్రారంభం కానుంది. అప్పటి నుంచి మూడు నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
TB Elimination Program in Telangana :ఇప్పటి వరకు పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్ ఇస్తుండగా 2025 నాటికి క్షయ నిర్మూలనే లక్ష్యంగా మొదటిసారిగా 18 సంవత్సరాలు పైబడినవారికి ఇవ్వనున్నారు. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ దీన్ని నిర్దేశించింది. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఇది అమలవుతోంది. ఇప్పటికే దేశంలో తొలివిడతగా ఎనిమిది రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ మొదలైంది. తాజాగా మలివిడతలో తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో అమలుకానుంది. రాష్ట్ర క్షయవ్యాధి నిర్మూలన విభాగం నోడల్ సంస్థగా దీన్ని నిర్వహిస్తోంది. టీబీ వచ్చే అవకాశం ఉందని గుర్తించిన వారికి మాత్రమే టీకా ఇవ్వనున్నారు. ఎవరెవరికి ఇవ్వాలని గుర్తించేందుకు ఆరు కేటగిరీలను నిర్దేశించుకున్నారు.
పెద్దల టీకా అమలయ్యే జిల్లాలు : హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, యాదాద్రి-భువనగిరి.
ఎవరెవరికి అంటే :
- 60 సంవత్సరాలు పైబడినవారందరికీ
- బీఎంఐ 18 కంటే తక్కువ ఉన్నవారు
- మద్యం తాగేవారు
- ఇప్పుడు పొగతాగుతున్నవారు, గతంలో పొగతాగినవారు
- క్షయవ్యాధిగ్రస్తులకు సన్నిహితంగా ఉన్నవారు
- గత ఐదు సంవత్సరాలుగా క్షయ వ్యాధిగ్రస్తులున్న ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులకు