LRS Application Process Slows Down : లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం అనుకున్నంత వేగంగా పుంజుకోవడం లేదు. దరఖాస్తు పరిశీలన ప్రక్రియ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా వాటికి ఆమోదం తెలిపి నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజలకు సాంత్వన కలిగించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈ ప్రక్రియ కోసం ముఖ్యమంత్రి ఒకసారి, రెవెన్యూశాఖ మంత్రి మూడు సార్లు సమీక్షలు నిర్వహించి వేగం పెంచేందుకు చర్యలు చేపట్టారు. వాస్తవానికి 2020 ఆగస్టు, సెప్టెంబరులోనే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించారు. తర్వాత వివిధ కారణాల వల్ల పథకం అమలు నిలిచిపోయింది.
జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు :కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది జనవరిలో ఎల్ఆర్ఎస్ను పునఃప్రారంభించింది. రాష్ట్రంలో 2020 ఆగస్టు 31న జారీ చేసిన జీవో 131... 2023 జులై 31న జారీ చేసిన జీవో 135లలోని నిబంధనలే ఎల్‌ఆర్‌ఎస్‌కు వర్తిస్తాయని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. 2020 ఆగస్టు 26కు ముందు రిజిస్టర్ చేసి అనుమతి లేని, చట్టవిరుద్ధమైన లేఅవుట్లు, ప్లాట్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఆయా జిల్లా కలెక్టర్లు దరఖాస్తులను పరిశీలించి అర్హులకు క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
రాష్ట్రంలో ఎల్‌ఆర్‌ఎస్ కింద సుమారు 25.67 లక్షల దరఖాస్తులు అందాయి. పురపాలక సంఘాల పరిధిలో 10.54 లక్షలు, గ్రామపంచాయతీల పరిధిలో 10.76 లక్షలు రాగా మిగిలినవి కార్పొరేషన్ల పరిధిలో వచ్చాయి. వాటి పరిశీలన, ఆమోదం, ఫీజు వసూలుకు వివిధ దశలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూములను రక్షిస్తూ అర్హత ఉన్న లేఅవుట్లను క్రమబద్ధీకరించే బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.
ఇతర శాఖల సిబ్బంది కూడా పరిశీలనకు :పురపాలక, రెవెన్యూ శాఖలే కాకుండా అవసరమైతే ఇతర శాఖలకు చెందిన సిబ్బందిని కూడా నియమించుకుని దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో కొన్ని జిల్లాల్లో నీటిపారుదల శాఖ అధికారులను కూడా దరఖాస్తు పరిశీలన బృందాల్లో నియమించారు. అనంతరం పరిశీలన ప్రక్రియను నాలుగు దశలుగా చేపట్టగా గత నెలాఖరు వరకు సుమారు 4.50 లక్షల దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయినట్లు సమాచారం. వాటిలో ఆమోదించినవి 70 వేలలోపే ఉన్నట్లు తెలిసింది.
కలెక్టర్ల పనితీరుపై మంత్రి అసంతృప్తి : ములుగు, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, వనపర్తి తదితర జిల్లాలు దరఖాస్తుల పరిశీలన, ఆమోదంలో వెనుకబడి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ల పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకం అమలుకు నాలుగేళ్లుగా లక్షల మంది ఎదురుచూస్తుండగా క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న జిల్లాల్లోనూ పరిశీలన ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.