Dharani Responsibilities for Deputy Tahsildars :ధరణి పోర్టల్‌కు సంబంధించి జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను, తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం, మరికొన్ని సంస్కరణలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం సాగుభూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లు, భూసమస్యల పరిష్కారం కోసం ధరణి రిజిస్ట్రేషన్ల బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జిల్లా కలెక్టర్ల నుంచి పలురకాల అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం, అదే మార్గంలో త్వరలో మరికొన్ని సంస్కరణలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లతోపాటు, భూ సమస్యల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు- సంయుక్త సబ్ రిజిస్ట్రార్లు నిర్వహిస్తున్నారు. అయితే, రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ల సేవలతోనే వారి సమయం గడిచిపోతోంది. భూ సమస్యలు ఇతర ప్రొటోకాల్ సేవల పరిశీలన పనులు అధికారులకు భారంగా మారుతున్నాయి. దీంతో భూ సమస్యల పరిష్కారంలో వేగం తగ్గిపోతోంది.
ఈ క్రమంలోనే మండల స్థాయిలో పనిని విభజించి సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ధరణి రిజిస్ట్రేషన్లను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించే నిర్ణయం తీసుకోనున్నారు. కార్యాలయ నిర్వహణ, వివిధ సమస్యల పరిష్కారం ఇతర అధికారిక విధులతో పాటుగా కార్యాలయ పర్యవేక్షణ అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అమలైతే తహసీల్దార్లకు మాత్రమే ఉన్న ధరణి లాగిన్‌ను డిప్యూటీ తహసీల్దార్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.