Telangana Government Lands in OLX : ప్రభుత్వ భూములను ఎవరైనా ఎలా అమ్ముతారు? వేలం వేస్తారు, లేదంటే బహిరంగంగా ప్రకటన ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే అమ్ముతుంది. కానీ OLXలో ప్రభుత్వ భూమి అమ్ముతామని పెడతారా? అసలు ప్రభుత్వ భూములను OLXలో అమ్మడం ఏంటి అనుకుంటున్నారా. ఇదంతా చూస్తే మీకు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది కదూ! అసలు విషయం తెలిస్తే వామ్మో! మరీ ఇంతకు తెగించారా అనక మానరు. కొందరు భూ కబ్జాదారులు తక్కువ రేటుకే భూములు అంటూ ఈ కామర్స్ సైట్ (OLX)లో ఫొటో, భూమి కొలతలు, జీపీఎస్ ఫొటోలతో సహా ప్రకటన ఇచ్చారు. మీకు భూమి కావాలంటే ఈ కింది నంబర్‌కు కాల్ చేయమని బహిరంగంగానే భూమిని అమ్ముతున్నారు. భూ బకాసురుల ఈ వింత ప్రకటనకు చూసిన వారంతా భూములను ఇలా కూడా అమ్ముతారా అంటూ నోటిన వేలేసుకుంటున్నారు.
ఈ OLX ప్రకటనలు చూసిన బీజేపీ నేతలు షాక్‌కు గురయ్యారు. అదేంటి ప్రభుత్వ భూమిని ఓఎల్ఎక్స్లో పెట్టడం ఏంటని వెంటనే పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసి అసలు విషయాలను బయటకు తీసుకొచ్చారు. ఈ మొత్తం తతంగం అంతా హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని సర్వే నంబర్ 307 గాజుల రామారం, బాలయ్య బస్తీ పక్కన ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ భూమిని భూ బకాసురులు ఆక్రమించారు. రెవెన్యూ, మున్సిపల్ అనుమతులు లేకుండా 477 ప్లాట్లుగా విభజించారు. ప్రభుత్వ భూమిని మట్టితో చదును చేస్తూ, పేద ప్రజలకు అమ్మడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు కుత్బుల్లాపూర్ డిప్యూటీ ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. తక్షణమే ప్రజలు మోసపోకుండా ప్రభుత్వ భూమిలో భద్రత కంచె వేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు.