Welfare Schemes Money Recovery Temporarily Stoped : సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి సొమ్ము రికవరీ చేసే చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అర్హత లేకపోయినప్పటికీ ఆసరా పింఛన్లు, రైతుబంధు పొందారంటూ ఇటీవల ఇచ్చిన రికవరీ నోటీసులు వివాదాస్పదంగా మారడంతో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయం, జిల్లాస్థాయి అధికారులకు ఆదేశాలు పంపారు.
వివిధ సంక్షేమ పథకాల్లో కొందరు అనర్హులు లబ్ధి పొందినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని సీఎస్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అనర్హులకు చేరకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై వివిధ స్థాయిల్లో చర్చలు జరిగినట్లు వివరించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం గుర్తించిన లోపాలు వాటిని ఎలా సరిదిద్దాలని అంశాలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉందన్నారు.
సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకే చేరడంతో పాటు ఇప్పటివరకు అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ చేయడంపై ప్రభుత్వం త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సీఎస్ తెలిపారు. మార్గదర్శకాలు జారీ అయ్యే వరకు రికవరీ కోసం నోటీసులు, ఇతర చర్యలు చేపట్టరాదని కలెక్టర్లు, ఇతర అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.
ఆసరా పింఛను వెనక్కి ఇచ్చేయాలని వృద్ధురాలికి నోటీసులు :భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పక్షవాతంతో బాధపడుతున్న 80 ఏళ్ల వృద్ధురాలు దాసరి మల్లమ్మకు ఆసరా పింఛను కింద ఇచ్చిన డబ్బులపై ప్రభుత్వం నోటీసులు పంపిన విషయం విదితమే. మల్లమ్మకు ఆసరా పింఛను కింద ఇచ్చిన రూ.1.72 లక్షలను తిరిగి వెనక్కి కట్టాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ చర్యను బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఆసరా సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ ప్రభుత్వం దారుణ వైఖరిని నిరూపించిందని అన్నారు. అయితే పింఛను పొందేందుకు దాసరి మల్లమ్మ అనర్హురాలని ప్రభుత్వం పేర్కొంది.
Rythu Bandhu scheme Recovery in Telangana : గతంలో రైతుబంధుపై ప్రభుత్వం వ్యవసాయేతర భూములకు ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. వెంచర్లపై ఇచ్చిన రైతుబంధు సొమ్ము రికవరీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతుబంధుగా తీసుకున్న రూ.16 లక్షలు తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. గతంలో 33 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి రైతు యాదగిరిరెడ్డి అమ్మేశారు. ఆ రైతుకి రూ.16 లక్షల రైతుబంధును ప్రభుత్వం చెల్లించింది.
అలాంటి వారు రైతుబంధు డబ్బులు తిరిగి ఇచ్చేయండి - ప్రభుత్వం ఆదేశం - Rythu Bandhu scheme Recovery
ఇప్పటి వరకు తీసుకున్న పింఛన్ మొత్తాన్ని తిరిగిచ్చేయండి - అలాంటి వారందరికి సర్కార్ నోటీసులు - Aasara pensions misuse in Telangana