Indiramma Housing Scheme in Telangana Updates :తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్ల అర్జీల పరిశీలనకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు ఇండ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సర్కార్ ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
TG Govt Exercise on Indiramma Illu Applications : రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత డబుల్ బెడ్ రూం ఇండ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.7,740 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ నిధులను నాలుగు దశల్లో సర్కార్ విడుదల చేస్తుందని తెలిపింది.
ఈ పథకాన్ని ఈ సంవత్సరం మార్చి 11న భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఇళ్ల నమూనాలనూ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తెలంగాణ సర్కార్ బడ్జెట్‌లో నిధులు కేటాయించటంతో హడ్కో సుమారు రూ.1,000 కోట్లు రుణంగా మంజూరు చేసింది. పట్టణ ప్రాంతాల ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత మొత్తం అందుతుంది. ఆయా లెక్కలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.
లబ్ధిదారుల ఎంపికే సవాల్ :ఏడాదికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన ఐదేళ్లలో 22.50 లక్షల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం ఉంది. వచ్చిన అర్జీలు 82.82 లక్షలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వడపోత సవాల్‌గా మారింది. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకున్న మీదటే ముందడుగు వేయాలని అధికారులు భావిస్తున్నారు.
అధ్యయనానికి బృందాలు :పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే క్రమంలో ఇతర రాష్ట్రాలు అమలుచేస్తున్న గృహ నిర్మాణ పథకాల విధివిధానాలను అధ్యయనం చేయాలని తెలంగాణ సర్కార్ తాజాగా నిర్ణయించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయమై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పథకం అమలులో ఆయా రాష్ట్రాల అనుభవాలనూ పరిగణనలోకి తీసుకోవటం ద్వారా తెలంగాణలో పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని నిర్దేశించారు. ఈ నేపథ్యంలోనే అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాలు వేర్వేరు రాష్ట్రాల్లో పర్యటించనున్నాయి.