Telangana Governor visited Jangaon Collectorate: ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జనగామ జిల్లాకు చేరుకున్నారు. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్లు శాలువాలు కప్పి, పూల మొక్కలతో సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం రాష్ట్ర గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించి పరిశీలించారు. అనంతరం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నాయకులు, అధికారులతో కలిసి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జిల్లా అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యసదుపాయాల గురించి అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా గవర్నర్‌కు వివరించారు.
అభివృద్ధి గురించి గవర్నర్‌కు వివరించిన అధికారులు : తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2016లో జనగామ జిల్లా ఏర్పడిందని జిల్లా కలెక్టర్ గవర్నర్‌కు వివరించారు. జిల్లాలో 12 మండలాలు ఉండగా, 281 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నాని తెలిపారు. 2011 సెన్సస్ ప్రకారం జిల్లాలో మొత్తం 5,34,991 మంది జనాభా కలిగి ఉందన్నారు. పాలకుర్తి సోమలింగేశ్వర స్వామి ఆలయం, చిల్పూర్‌లోని బుగులు వేంకటేశ్వర స్వామి దేవాలయం, వల్మిడి రామాలయం, జాఫర్‌గఢ్ నరసింహ స్వామి ఆలయం, బమ్మెర పోతన, ఇలా ఎన్నో చారిత్రక కట్టడాలకు జిల్లా నిలయంగా మారిందన్నారు.