CM Revanth On Kaleshwaram Project Repair :మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల్లో వేగం పెంచడంపై రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఒప్పందం ప్రకారం పనులు పూర్తయ్యాయా లేదా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లో ఉందా లేదా? ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌కు ఒప్పందం జరిగిందా లేదా లాంటి అంశాలన్నింటినీ పక్కనపెట్టి ఎన్డీఎస్ఏ సూచించిన మేరకు తాత్కాలిక మరమ్మతులు, అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయించడంపైనే దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
దీనిపై ముఖ్యమంత్రితో సంబంధిత శాఖ అధికారులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్స్ చేయించడానికి అయ్యే వ్యయ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం చేసిన పనులకు సంబంధించిన తాత్కాలిక మరమ్మతులకు అయ్యే ఖర్చును మాత్రం నిర్మాణ సంస్థలే భరించాలని సూచించినట్లు తెలుస్తోంది.
డిజైన్ లోపం ఒప్పుకున్న నిర్మాణ సంస్థ: డిజైన్‌లో లోపం కాబట్టి తమ బాధ్యత లేదని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ నీటిపారుదల శాఖకు లేఖలు రాసింది. పని పూర్తయినట్లు 2021 మార్చి 15నే ధ్రువీకరణ ఇచ్చిన నేపథ్యంలో రెండేళ్లు గడిచాయని పేర్కొంది. ఇప్పుడు తమది బాధ్యత కాదంది. అయితే ఒప్పందం ఇంకా కొనసాగుతుందని 2022 మార్చి వరకు గడువు పొడిగింపు తీసుకున్నారని ఈఎన్సీకి ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ రాసిన లేఖ ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో చర్చకు వచ్చాయి.
ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థే పనులు చేయాలని స్పష్టంగా చెప్పినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశం తర్వాత మేడిగడ్డ బ్యారేజీలో తాత్కాలిక మరమ్మతు పనులను నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చేపట్టింది. సీసీ బ్లాకులను పునరుద్ధరించడం ఎగువ, దిగువ భాగాలను మొత్తం శుభ్రం చేయడం బుంగలను ఇసుక బస్తాలతో పూడ్చడం లాంటి పనులతోపాటు ఏడో బ్లాక్‌లో గేట్లను పైకెత్తే పనులను చేపట్టింది.