Telangana State New Logo Unveiling Postponed : తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. తొలుత జూన్ 2న నూతన అధికారిక చిహ్నాన్ని విడుదల చేయాలని భావించిన ప్రభుత్వం, దీనిపై మరింత సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగించి ఆ స్థానంలో అమరవీరుల స్థూపం, బతుకమ్మతో కొత్త చిహ్నం ఖరారు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ ఆందోళన చేపట్టగా, వివిధ వర్గాల నుంచి సుమారు 200కు పైగా సూచనలు వచ్చాయి. దీంతో చర్చల తర్వాతే అధికారిక చిహ్నం ఖరారు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా స్పష్టత రాలేదు. జూన్ 2న జరిగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర అధికారిక గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ అధికారిక చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, వాటిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కొత్త అధికారిక చిహ్నం కోసం ఇప్పటికే చిత్రకారుడు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు చర్చించారు. దానికి అనుగుణంగా కొన్ని నమూనాలు సిద్ధం చేశారు. ప్రజలు, ప్రజా జీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా రాష్ట్ర కొత్త చిహ్నాన్ని రూపొందిస్తున్నారు. అంతేకాకుండా దీనిపై రాష్ట్ర మంత్రివర్గ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు చూపించి వారి సూచనలు, సలహాలు తీసుకుని తెలంగాణ అధికారిక చిహ్నానికి తుది రూపు ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్ణయించారు.
2.30 నిమిషాల నిడివితో మరో అధికారిక గీతాన్ని :తాజాగా మరిన్ని సలహాలు, సూచనలు స్వీకరించిన అనంతరం రాష్ట్ర అధికారిక చిహ్నానికి తుది రూపు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 2న రాష్ట్ర గీతాన్ని మాత్రమే విడుదల చేయనున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్రూతలూగించిన అందెశ్రీ గీతం ‘జయ జయహే తెలంగాణ’ స్వరాలను సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరపరుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పూర్తి గీతాన్ని 13.30 నిమిషాల నిడివితో రూపొందించారు. తెలంగాణ అధికారిక కార్యక్రమాల్లో, జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా ఆలపించడానికి వీలుగా 2.30 నిమిషాల నిడివితో మరో గీతాన్ని రూపొందిస్తున్నారు. ప్రధాన గీతం ప్రాధాన్యత తగ్గకుండా అందెశ్రీ దీన్ని తీర్చిదిద్దారు.